ఇవాళ ఉదయం బస్ డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. మరోవైపు.. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను విధుల్లోకి తీసుకుని.. బస్సులను నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మె చేస్తున్న జేఏసీ నేతలు.. ఇవాళ హైదరాబాద్‌ గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. మరో సకల జనుల సమ్మెకు రెడీ అవుతామని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ ఈదురు వెంకన్న తీవ్ర హెచ్చరికలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు.. ఉద్యోగ, ప్రజా సంఘాలు కూడా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన సమస్యలు, చేస్తున్న డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఇప్పుడు చేస్తున్న సమ్మెను మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు.తాము సమ్మె నోటీసు ఇచ్చినా.. డిమాండ్లను నెరవేర్చకుండా . తమకు కమిటీ అవసరం లేదని.. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ ఛైర్మన్ డిమాండ్ చేశారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె ఆపేది లేదని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తమ సమ్మెకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మరోవైపు.. ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడంతో వారు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.