టోల్‌గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుల దాడి ఘటనలో ట్విస్ట్.. తననెవరూ కొట్టలేదన్న మేనేజర్..

Wait 5 sec.

టీడీపీ నేత, అమిలినేని సురేంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. టోల్‌గేట్ సిబ్బందిపై అనుచరులు దౌర్జన్యానికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలోని గండబోయినపల్లె టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం పది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. టోల్‌గేట్ వద్ద ఉన్న మహిళా సిబ్బందిపైనా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు వీడియోలో ఉంది. మహిళ అని కూడా ఆలోచించకుండా జుట్టుపట్టుకుని దాడి చేయటంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎమ్మెల్యే వాహనాన్ని ఆపారనే కోపంతోనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ గేట్ వద్ద పనిచేసే శ్రీలత అనే మహిళ, మేనేజర్ రవిపై దాడి చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే బండినే ఆపుతావా అంటూ వారిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు.. అనంతరం మేనేజర్ రవిని వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. మరోవైపు తనపై దాడి జరగలేదని మేనేజర్ రవి చెప్తున్నారు. వేరే వాహనాలు ముందు ఉండటంతో ఎమ్మెల్యే వాహనాన్ని పంపించేందుకు ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. మరోవైపు అనుచరుల తీరు కారణంగా గతంలోనూ అమిలినేని సురేంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. హరినాథ్ అనే ఏఆర్ కానిస్టేబుల్, ఆయన భార్య సుజాతపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడిచేశారంటూ గతేడాది ఆరోపణలు వచ్చాయి. సదరు ఏఆర్ కానిస్టేబుల్, అతని కుటుంబం విలేకర్ల సమావేశంలో ఈ ఆరోపణలు చేయటం అప్పట్లో కలకలం రేపింది. అనంతపురం రాంనగర్‌ 80 ఫీట్ రోడ్డులోని అపార్టుమెంట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ కుటుంంబం నివశించేది. అదే అపార్ట్‌మెంట్‌లో ఎమ్మెల్యే అనుచరులు ఉండేవారు.అయితే పిల్లలు ఆడుకునే విషయంలో తమ కుటుంబానికి, ఎమ్మెల్యే అనుచరులకు గొడవ జరగటంతో.. తన భర్త హరినాథ్‌ను, ఆయన స్నేహితుడు ప్రభాకర్‌ను ఎమ్మెల్యే అనుచరులు ఇంటికి వచ్చి కొట్టారని అప్పట్లో సుజాత తెలిపారు. పోలీసులకు ఫిర్యాదుచేసినా స్పందించటంలో లేదని ఆరోపించడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా అనుచరుల తీరు కారణంగా సురేంద్రబాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు.