ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన హైదరాబాద్ నివాసంలో సిట్అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని కారుమూరి నివాసంలో శనివారం సోదాలు చేపట్టారు. వైసీపీ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 23న విజయవాడలో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఉన్న ఇంటికి నోటీసులు కూడా అంటించారు. అయితే ఈ విచారణకు కారుమూరి హాజరు కాలేదు. తన భార్యకు అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనంటూ సిట్ అధికారులకు కారుమూరి లేఖ రాశారు. ఆమె బాగోగులు చూడాల్సి ఉందని.. మరో వారం రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే శనివారం రోజున హైదరాబాద్‌లో (ఏప్రిల్ 25) మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం కారుమూరిని విచారించారు. ఓ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు నాలుగు గంటలపాటు విచారించి.. ఆయన స్టేట్‌మెంట్ నమోదు చేశారు. కారుమూరి వయసు 60 ఏళ్లు పైబడిన నేపథ్యంలో ుచట్టప్రకారం ఆయన కోరిన చోట విచారించినట్లు సిట్ అధికారులు తెలిపారు. విచారణకు సహకరించారని.. అవసరమైతే కారుమూరి నాగేశ్వరరావును మరోసారి విచారిస్తామని తెలిపారు. మరోవైపు ఏప్రిల్ 30న విచారణకు హాజరుకావాలని కారుమూరి సునీల్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఆయనను విచారించనున్నారు. మరోవైపు లిక్కర్ రవాణా, టెండర్లు సబ్ కాంట్రాక్టులకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మద్యం రవాణాలో అక్రమాల ద్వారా ప్రభుత్వానికి రూ.200 నుంచి రూ. 250 కోట్ల వరకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.