తిరుమలలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. టీటీడీ కీలకప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత కనిపిస్తోంది.. పెట్రోల్ బంకులు మూసివేస్తున్నారు, నో స్టాక్ బోర్డులు ఉంటున్నాయి. కొన్ని బంకుల్లో పెంట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నా సరే వాహనాలు క్యూ కనిపిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు.. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. సహించేది లేదని స్పష్టం చేశారు. తిరుమలలో కూడా పెట్రోల్, డీజిల్ కొరతతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వార్తలొచ్చాయి.. వెంటనే టీటీడీ స్పందించింది, ఇంధన కొరతపై క్లారిటీ ఇచ్చింది. లేదని భక్తులకు టీటీడీ స్పష్టత ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని హెచ్‌పీ, ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోవడంతో మధ్యాహ్నం సదరు బంకుల్లో నో స్టాక్ బోర్డులను పెట్టారని తెలిపింది. సాయంత్రానికి హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ వచ్చిందని.. మళ్లీ ఇంధనం అందుబాటులోకి వచ్చిందన్నారు. సోమవారం ఉదయానికి ఐఓసీఎల్ పెట్రోల్ బంక్‌కు కూడా ట్యాంకర్ చేరుకుంటుందన్నారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీలర్లను కోరారు.తిరుమలలో ఉన్న పెట్రోల్‌ బంకులు మూతపడటంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. నో స్టాక్ బోర్డులు పెట్టడంతో భక్తులు పెట్రోల్‌ బంకుల దగ్గర వేచి చూశారు.. ప్రైవేట్ కార్లు, ట్యాక్సీల్లో భక్తులు తిరుపతికి వెళ్లాల్సిన భక్తులు దిగేశారు. వారంతా బస్సులు, రైళ్ల సమయం దాటి పోతుందనే భయంతో ఆర్టీసీ బస్సులపై ఆధారపడ్డారు. ఆదివారం సాయంత్రానికి హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడంతో భక్తులకు ఊరట దక్కింది. సోమవారం ఉదయం మరో పెట్రోల్ బంకు ఓపెన్ కానుంది. తిరుమల వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచిస్తోంది.తిరుపతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. కృత్రిమ కొరతను అదునుగా తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడితో కలిసి తిరుపతిలోని మహతి ఆడిటోరియం సమీపంలోని పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. తిరుపతి జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. తాత్కాలికంగా కొన్ని అవుట్‌లెట్లలో సమస్య ఉన్నప్పటికీ త్వరలోనే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు కలెక్టర్. సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని సూచించారు.సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయడు. వసరం లేకపోయినా సరే చాలామంది వాహనదారులు ట్యాంక్‌ ఫుల్‌ చేయాలంటూ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యంపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ పెరుగుతోందని.. రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందన్నారు. ప్రజలు సంయమనం పాటించి అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.