నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్.. 45.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత, ఎండల దెబ్బకు ముగ్గురు మృతి

Wait 5 sec.

తెలంగాణ లో భానుడు ప్రచండ రూపం దాల్చుతున్నాడు. ఉదయం నుంచే భగ్గమంటున్నాడు. ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అడవుల జిల్లాగా పేరుగాంచిన కొలిమిని తలపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఆదివారం నాడు ఉష్ణోగ్రత ఏకంగా 45.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికం కావడం గమనార్హం. ఆదిలాబాద్ మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత 41 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటేసింది. అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.మాడు పగిలే ఎండల తీవ్రతకు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మాదినేని ఆరోగ్య బాబు (57) అనే రైతు తన పొలానికి వెళ్లి ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోయి మరణించారు. అలాగే నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన ఎన్. యాదయ్య (56), సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన రావుల వేలాద్రి (60) వ్యవసాయ పనులు చేస్తూ వడదెబ్బకు గురై అస్వస్థతతో మృతి చెందారు. మధ్యాహ్న సమయంలో పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.భారత వాతావరణ శాఖ (IMD) అందించిన తాజా సమాచారం ప్రకారం.. నేడు, రేపు (సోమ, మంగళవారాల్లో) ఉష్ణోగ్రతలు మరో 1 నుండి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగించేలా వర్ష సూచన కూడా జారీ చేశారు. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఏప్రిల్ 29 నుండి మే 2 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించవచ్చునని ఐఎండీ అంచనా వేస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆ సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని చెబుతున్నారు. అలాగే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని.. దాహం వేయకపోయినా తరుచూ నీళ్లు తాగాలని, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. వేపుళ్లు, మసాలా ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినాలని సూచిస్తున్నారు. గర్భిణిలు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.