ఓ పక్క రామరాజు పెద్ద కోడలు నెల తప్పిందని ఊరంతా పందిరి వేసి ఓ రేంజ్‌లో సంబరాలు చేస్తున్నాడు. ఇటు శ్రీవల్లి కూడా తన కడుపు పండబోతుందని.. తన కడుపులో పడ్డ బిడ్డ వల్లే తనకి కొత్తజీవితం లభించిందని.. ఇక ఏ తప్పు చేయకుండా బుద్దిగా కాపురం చేసుకుంటానని పశ్చాత్తాప పడుతుంది. అయితే అమ్మడు కడుపూ పండలేదూ.. గిడుపూ పండలేదు.. అది అత్తారింట్లో అడుగుపెట్టడానికి డాక్టర్‌తో కడుపొచ్చిందని అబద్దం ఆడించానంటూ ఇడ్లీ గాడి దగ్గర బాంబ్ పేల్చింది భాగ్యం. మన బేబీకి నోబేబీనా అంటూ కళ్లు తిరిగిపడిపోతాడు ఇడ్లీ. అటు రామరాజు.. కోడలు పిల్ల ఎక్కడ్రా అంటూ తెగ హడావిడి చేస్తుంటాడు. అదిగో వదినగారి ఎంట్రీని మరిదిగారు చాలా సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేశారు చూడండి అని అంటారు నర్మద, ప్రేమలు. కట్ చేస్తే శ్రీవల్లిని పల్లకిలో మోసుకొస్తుంటారు. ఆమె ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదు. ఆ సీన్ చూస్తే.. వీళ్లేంట్రా పావలా పెర్ఫామెన్స్‌కి రూపాయిన్నర రియాక్షన్స్ ఇస్తున్నారనిపిస్తుంటుంది. ఇక ధీరజ్ అయితే కొత్తగా వచ్చిన ప్రేమతో అప్పుడే సాంగ్స్ మొదలుపెట్టేశాడు. ప్రేమ దేశపు యవరాణీ.. అంటూ ఆ పల్లకిలో ప్రేమని ఊహించుకుని సంబరపడిపోతాడు. ఇక ప్రేమ దగ్గరకు వచ్చి.. ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు ధీరజ్. ఏమైంది? అని ప్రేమ అడిగితే అప్పుడు కలలో నుంచి బయటకు వస్తాడు ధీరజ్. అబ్బే ఏం లేదు ఏం లేదులే అని కవర్ చేస్తాడు ధీరజ్. అటు నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని ఇడ్లీగాడు వణికిపోతుంటాడు. ఎందుకు అలా వణికి చస్తున్నావ్ అని భాగ్యం అంటే.. ‘ఎందుకు అని నెమ్మదిగా అంటావ్ ఏంటి భాగ్యం.. అమ్మడి కడుపు డ్రామా అని బయటపడ్డ మరుక్షణమే.. మనకి శవయాత్ర జరుగుతుంది పిక్చర్ క్లియర్‌గా కనిపిస్తే.. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాం.. వెళ్లి నిజం చెప్పేద్దాం భాగ్యం’ అని అంటాడు ఇడ్లీ. ఇక రామరాజు.. మన ఇంట్లో జరుగుతున్న మొట్ట మొదటి శుభకార్యం.. మొదటి అక్షింతలు మన పెద్దమ్మాయి వేస్తే బావుంటుంది కదా అని అంటాడు రామరాజు. మీకు ఎంతైనా మీ పెద్ద కూతురు అంటేనే ఇష్టం అని మరోసారి నిరూపించారు కదా.. ఇంతకీ ఎక్కడా? అని అంటుంది వేదవతి. ఇంతలో భోరున ఏడుస్తూ ఎంట్రీ ఇస్తుంది కామాక్షి. రామరాజు ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతుందంటే ఏదొక ఫిటింగ్ ఉండాలి కదా.. మరి రామరాజు పెద్ద కూతురు ఏం ఫిటింగ్ పెట్టిందో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.