ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. 3 పెట్రోల్ బంకులు సీజ్

Wait 5 sec.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఒకపక్క ఎండలు మండిపోతుంటే.. మరోపక్క పెట్రో మంట రేపుతోంది. పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతూ.. పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయిల్ కంపెనీలు తగినంత సరఫరా చేయడం లేదని.. అందుకే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు తప్పట్లేదని.. యజమానులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌ కొరత.. వాహనదారులు పడుతున్న అవస్థలపై తాజాగా ముఖ్యమంత్రి నారా నాయుడు స్పందించారు. సంబంధిత అధికారులతో మరోసారి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా మళ్లీ మునుపటిలా సాధారణ స్థితికి చేరుకునే వరకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు.. పెట్రోల్, డీజిల్ ఎలా లోడ్‌ డిస్పాచెస్‌ జరుగుతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. పెట్రోల్ బంకులకు పెట్రోల్‌, డీజిల్‌ నిరంతరం.. ఎలాంటి అడ్డంకులు లేకుండా సరఫరా అయ్యేలా చూస్తున్నామని వివరించారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున వాహనాల క్యూలైన్లు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇంకా అవసరం అయితే వాహనదారులకు టోకెన్‌ సిస్టమ్‌ పెట్టాలని సూచించారు.ఇక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్‌ కొరత కొనసాగుతుండగా.. కొందరు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు మాత్రం నిబంధనలను పాటించడం లేదు. దీంతో అలాంటి పెట్రోల్ బంకులపై ఉన్నతాధికారులు కొరఢా ఝళిపిస్తున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో రూల్స్ పాటించకుండా.. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో అవకతవకలకు పాల్పుడుతున్న 3 పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేట శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్‌తోపాటు.. పిడుగురాళ్ల తిరుమల ఫిల్లింగ్ స్టేషన్‌.. చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్‌పై పల్నాడు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పెట్రోల్ బంకులు పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుపుతున్నాయని గుర్తించి.. కలెక్టర్ కృతికా శుక్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.