మార్కెట్లు భారీగా పడినా దూసుకెళ్లిన టాటా స్టాక్.. ఒక్కరోజులోనే 13 శాతం జంప్.. లాభాలే లాభాలు!

Wait 5 sec.

: పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితి తొలగట్లేదు. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా.. మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట కాల్పుల విరమణ కుదిరినా.. అమెరికా- ఇరాన్ మధ్య తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. ఇక రెండో విడత చర్చలపై క్లారిటీ లేదు. దీంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 28న చూస్తే బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కు దాటేసింది. దీంతో ఒకవైపు బంగారం ధరలు భారీగా పడిపోతుండగా.. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం సెషన్‌లో సూచీలు లాభపడ్డప్పటికీ.. మంగళవారం రోజు మళ్లీ పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 417 పాయింట్ల పతనంతో 76,887 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్ల వరకు తగ్గి 23,996 వద్ద సెషన్ ముగించింది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, బీఎస్ఈ, బజాజ్ ఫిన్‌సర్వ్, డీమార్ట్, డాక్టర్ రెడ్డీస్ వంటి స్టాక్స్ పుంజుకున్నాయి. ఇక టీసీఎస్ సహా ఐటీ స్టాక్స్, ఇండిగో, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు పతనం అయ్యాయి. >> అయితే ఇదిలా ఉన్నప్పటికీ.. మార్కెట్లు భారీగా పడిపోయినా దిగ్గజ టాటా గ్రూప్‌కు చెందిన టాటా కెమికల్స్ స్టాక్ భారీగా ఎగబాకింది. కిందటి రోజు రూ. 722.30 వద్ద ముగిసిన షేరు ధర.. ఇవాళ నష్టాల్లోనే ప్రారంభమైనా తర్వాత భారీగా లాభపడింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో 13 శాతానికిపైగా పెరిగి రూ. 818 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. చివరకు 11 శాతానికిపైగా పెరిగి రూ. 802.15 వద్ద స్థిరపడింది.కంపెనీ మార్కెట్ విలువ రూ. 20.41 వేల కోట్లుగా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1026.65 గా ఉంది. 52 వారాల కనిష్ఠ ధర రూ. 580.30 గా ఉంది. షేరు ఇవాళ భారీగా పుంజుకున్న క్రమంలో దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వచ్చాయి. టాటా కెమికల్స్ మే 4న 2025-26 ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాల్ని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఇవాళ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. సుమారు 52 లక్షల వరకు ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. ఇలా హెవీ ట్రేడింగ్ వాల్యూమ్స్ నేపథ్యంలో షేరు ధర పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. అందుకే.. వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.