భారతదేశంలో క్రెడిట్ కార్డ్ రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లపై పన్ను విధిస్తారా? మీరు తెలుసుకోవలసిన విషయాలు

Wait 5 sec.

Income Tax: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు ఉపయోగించని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. షాపింగ్ చేసినా, బిల్లులు కట్టినా క్రెడిట్ కార్డుల లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ లేదా ఎయిర్ మైల్స్ రూపంలో ఏదో ఒక ప్రయోజనం లభిస్తుంది. అయితే, 2026 రిటర్నులు దాఖలు చేసే సమయం సమీపిస్తున్న క్రమంలో ఇన్వెస్టర్లలో ఓ సందేహం నెలకొంది. ఈ ప్రయోజనాలపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.సాధారణంగా వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డులు వాడినప్పుడు వచ్చే రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్ బ్యాక్ లను ఆదాయపు పన్ను శాఖ ఆదాయంగా పరిగణించదు. వీటిని వస్తువుల కొనుగోలుపై లభించే రిబేట్ లేదా డిస్కౌంట్ గానే చూస్తారు. ఉదాహరణకు మీరు రూ.1000 పెట్టి ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు రూ.50 క్యాష్ బ్యాక్ వస్తే అది మీకు వచ్చిన అదనపు ఆదాయంకాదు. ఆ వస్తువు ధర రూ.950కి తగ్గిందని అర్థం. కాబట్టి వీటిపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పన్ను కట్టాల్సి వస్తుంది?కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం క్రెడిట్ కార్డుల రివార్డులు పన్ను పరిధి లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించిన ఖర్చుల కోసం పర్సనల్ క్రెడిట్ కార్డును ఉపయోగించి దానిపై భారీగా రివార్డులు లేదా క్యాష్ బ్యాక్ లు పొందింతే దానిని వ్యాపార ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. అలాగే రివార్డ్ పాయింట్ల ద్వారా పొందిన వోచర్లు లేదా గిఫ్ట్స్ విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు దాటితే వాటిని ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించే అవకాశం ఉంటుంది. రివార్డ్ పాయింట్లను నేరుగా నగదుగా మార్చుకుని బ్యాంక్ అకౌంట్లోకి తీసుకుంటే అది ఆదాయం కిందకు వచ్చే అవకాశం ఉంటుంది.ఐటీ రిటర్నుల్లో చూపించాలా? అవసరం లేదు. ఒక వేళ మీరు భారీ మొత్తంలో రివార్డులు పొంది, అవి వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి అయినట్లయితే మాత్రం నోటీసుల భయం లేకుండా ఉండేందుకు వాటిని వెల్లడించడం ఉత్తమమని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ అనేవి ఖర్చు చేసినందుకు ఇచ్చే ప్రోత్సాహకాలు మాత్రమే. ఇవి ద్రవ్య రూపంలో నేరుగా ఆదాయాన్ని ఇవ్వవు. కాబట్టి మెజారిటీ కేసుల్లో ట్యాక్స్ ఉండదు. అయితే, రివార్డులు మరీ భారీగా ఉన్నప్పుడు లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వాడినప్పుడు అప్రమత్తంగా ఉండాలి.