ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం.. రూ.21వేల కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో తీపికబురు చెప్పింది.. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను (జీఈసీ)కు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (Union Ministry of Renewable Energy Resources) ఆమోదం తెలిపింది. జీఈసీ ప్రాజెక్టును ఎన్ని దశల్లో పూర్తి చేయనున్నారనే వివరాలు పంపాలని ట్రాన్స్‌కోను కోరారు. ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసేందుకు వీలుగా ఈ వివరాలు అడిగారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ.6,450 కోట్లు గ్రాంటుగా అందించనుంది.మొత్తం రూ.21,500 కోట్లతో ట్రాన్స్‌కో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను ప్రతిపాదించారు. సోలార్ పవర్ 11వేల మెగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి 7,300 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం నెట్‌వర్క్ విస్తరించేలా ప్లాన్ చేశారు. ట్రాన్స్‌కో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను (జీఈసీ)ను నాలుగు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ఒక్కో దశ పూర్తి చేయడానికి రెండేళ్ల చొప్పున సమయం పడుతుందని అంచనాలు వేస్తున్నారు. అందుకు తగిన విధంగా 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఎగుమతికి సంబంధించి దాదాపుగా 80798 మెగావాట్ల సోలార్, విండ్, పీఎస్‌పీ ప్రాజెక్టులకు అమనుతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 9,386 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశారు.. 11,725 మెగావాట్ల పనులు కొనసాగుతున్నాయి. రాయలసీమ పరిధిలో ఎక్కువశాతం రెన్యూవల్ ప్రాజెక్టులు ఏర్పాటవుతుండటంతో.. అక్కడి నంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కోస్తాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించాల్సి ఉంటుంది. అలా విద్యుత్‌ను తరలించాలంటే నెట్‌వర్క్ అవసరం చాలా ఉంది. కొత్తగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు 1200 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌నూ విస్తరించనున్నారు.ట్రాన్స్‌కో ముందుగానే కొత్త ప్రాజెక్టుల్ని గుర్తించి నెట్‌వర్క్ విస్తరణ కోసం ప్లాన్ చేసింది. భవిష్యత్‌లో విద్యుత్ సరఫరాకు సంబంధించి నెట్‌వర్క్‌కు సమస్యలు లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖలో డేటా సెంటర్లతో పాటుగా పరిశ్రమలు వస్తుండంతో.. అక్కడికి విద్యుత్ సరఫరా చేయాలని నెట్‌వర్క్ చాలా ముఖ్యం అంటున్నారు.. అందుకే విస్తరణపై ఫోకస్ పెట్టారు. రాయలసీమలో ఉన్న సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను సెంట్రల్ నెటవర్క్‌కు అనుసంధానం చేయనున్నారు. అనంతరం 17 సబ్ స్టేషన్ల ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ జీఈసీ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నాలుగు కొత్త సబ్ స్టేషన్లు (ఒక్కొక్కటి 400 కేవీ సామర్థ్యం) కూడా అందుబాటులోకి రానున్నాయి.