తండ్రి, పెద్ద కూతురు మృతి.. మూడ్రోజులుగా మృతదేహాల మధ్యే తల్లి, చిన్న కూతురు, ఏం జరిగింది..?

Wait 5 sec.

జిల్లా నేలకొండపల్లి మండలం బుర్హాన్‌పురంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతం ఆదివారం (ఏప్రిల్ 26) రాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు, మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము అనే వ్యక్తి ఒక దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ, భార్య రమ్య, ఇద్దరు కుమార్తెలు దివ్య నైనీ (5), దీక్షలతో కలిసి బుర్హాన్‌పురంలో నివసిస్తున్నారు. అయితే.. గత మూడు రోజులుగా రాము ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఆయనకు ఫోన్ చేసిన మిత్రులకు, బంధువులకు భార్య రమ్యే సమాధానం ఇస్తూ.. ఆయన అనారోగ్యంతో ఉన్నారని చెబుతూ వస్తోంది.ఆదివారం ఉదయం పక్కింటి మహిళ పలకరించినప్పుడు కూడా రమ్య ఒంటి నిండా దుప్పటి కప్పుకుని వచ్చి.. ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా.. గత మాడ్రోజులుగా శుభ్రం చేయలేదని అందుకే ఈ వాసన అని పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. అయితే సాయంత్రం సమయానికి ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు రమ్య సోదరుడికి విషయం చెప్పారు. ఆయన వచ్చి చూడగా ఇంటి తలుపులు పెట్టి ఉన్నాయి. ఎంత తట్టినా తలుపులు తెరవకపోవటంతో.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడి దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. మంచం కింద రాము, ఐదేళ్ల దివ్య నైనీ మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. వాటి పక్కనే రమ్య, చిన్న కూతురు దీక్ష సైతం అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. రమ్య తన భర్తను, పెద్ద కూతురిని మూడు రోజుల క్రితమే హతమార్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆ మృతదేహాలతోనే ఆమె మూడు రోజులుగా ఇంట్లోనే గడిపినట్లు తెలుస్తోంది. చిన్న కూతురు దీక్షను కూడా చంపేందుకు ప్రయత్నించి, చివరకు విషయం బయటపడుతుందనే భయంతో ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రమ్య, చిన్న కూతురు దీక్ష పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి గల కారణాలను వెల్లడించేందుకు రమ్య నిరాకరిస్తోంది. ఆర్థిక ఇబ్బందులా? లేక కుటుంబ కలహాలా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.