గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరంలో అగ్ని ప్రమాదాలు నగరవాసులను బెంబేలెత్తిస్తుండగా.. ఇవాళ మరో ఘోర ప్రమాదం జరిగింది. అంబర్‌పేట్ పరిధిలోని చే నెంబర్ జంక్షన్ వద్ద ఉన్న మహీంద్రా షోరూమ్‌లో మధ్యాహ్నం పూట ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. దీంతో షోరూంలో ఉన్న సిబ్బందితోపాటు.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై.. అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో.. మహీంద్రా షోరూమ్ నుంచి మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో పాటు ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. ఆ అగ్ని ప్రమాద తీవ్రతను గమనించిన మహీంద్రా షోరూమ్ సిబ్బంది.. పక్కనే ఉన్న ప్రజలు.. భయం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో షోరూమ్‌లో కార్లు, వాటి స్పేర్ పార్ట్స్, ఇతర విడిభాగాలు ఉండటంతో వేగంగా మంటలు విస్తరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వెంటనే షోరూం సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో.. పక్కనే ఉన్న ఇతర షాపులు, బిల్డింగ్‌లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనడానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే మహీంద్రా షోరూంలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎవరికైనా గాయాలు అయ్యాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.