తెలంగాణలోని బ మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళకు శుభవార్త చెబుతూ.. ఒక భారీ స్వయం ఉపాధి పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే లక్ష్యంతో.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళలు స్వయం ఉపాధిని పొంది, ఆర్థికంగా స్థిరపడే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి పొన్నం ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరగనుందని చెప్పారు. కేవలం కుట్టు మిషన్ల పంపిణీకే పరిమితం కాకుండా.. మహిళలకు అవసరమైన ఇతర వనరులను కూడా సమకూర్చడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నియోజకవర్గానికి 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం ద్వారా ప్రతి ప్రాంతంలోనూ మహిళా సాధికారతకు బలమైన పునాది పడనుందని చెప్పారు.బీసీ సంక్షేమ శాఖ ఈ పథకాన్ని కేవలం కుట్టు మిషన్ల పంపిణీగా మాత్రమే చూడటం లేదని..దాంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా వివిధ వృత్తుల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలకు అవసరమైతే ఆధునిక డిజైనింగ్, కుట్టు పనిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా శాఖా పరంగా చర్యలు తీసుకోనున్నట్లు కీలక ప్రకటన చేశారు. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిరుపేద, బలహీన వర్గాల మహిళలకు ఒక భరోసా లభించినట్లయింది. ఇంటి దగ్గరే ఉంటూ ఆదాయాన్ని గడించే మార్గం సుగమం కావడంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ పథకం ఒక వరంగా మారనుంది. మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం వేసిన ఈ అడుగు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.