ఆకివీడు రామాలయానికి ఆ రోజే శంకుస్థాపన.. రామ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రఘురామ

Wait 5 sec.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. పురాతన రామాలయాన్ని పునర్ః నిర్మించే కార్యక్రమంలో భాగంగా.. శిథిలావస్థకు చేరిన పాత ఆలయాన్ని తొలగించి.. నూతన ఆలయ నిర్మాణానికి అనుగుణంగా నేలను చదును చేసే పనులను ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. రామాలయ నిర్మాణానికి అన్ని ప్రభుత్వ అనుమతులు వచ్చాయని ఆయన తెలిపారు.రామాలయ పునర్నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన ప్రజలతోపాటు ఆకివీడు మున్సిపల్, రెవిన్యూ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పోలీసులు, ఆర్డీవో, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు శ్రీ రామ ఆలయ సమితి తరఫున రఘురామ ధన్యవాదాలు తెలిపారు.శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న రఘురామ కృష్ణరాజు ఆకివీడులోని పెదపేటలో ఉన్న పురాతన రామాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాకను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పరస్పరం దాడులు కూడా జరిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.మరుసటి రోజు రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. ఆకివీడులో ఉన్న పురాతన ఆలయం స్థానంలో కొత్త రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. దీని కోసం విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. . ఆ తర్వాత కోటి రూపాయల విరాళాలు వచ్చినట్లు రఘురామ ప్రకటించారు. హైకోర్టులో పిటిషన్..ఈ ఆలయ నిర్మాణం అంశం హైకోర్టుకు చేరింది. పెదపేటలో ప్రస్తుతం ఉన్నది రామాలయం కాదని.. దళిత సామాజికవర్గ ప్రజల కులదేవత అయిన గొంతెనమ్మ ఆలయం అని పేర్కొంటూ కొందరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరఫున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఆలయం ఉన్న ప్రదేశం ప్రభుత్వానికి చెందిన భూమి అని.. అక్కడ ముందస్తు అనుమతులు లేకుండా పునర్నిర్మాణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమంటూ వారు కోర్టుకు నివేదించారు. దీంతో .కోర్టు విచారణకు హాజరైన రఘురామ కృష్ణరాజు.. భక్తుల విరాళాలతోనే తాము ఆలయాన్ని నిర్మిస్తున్నామని.. చట్టపరంగా అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఏప్రిల్ 21న ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్ ఆలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్మానం చేసింది. 800 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిర్మాణం..ఆకివీడులో రామాలయాన్ని కృష్ణ శిలతో నిర్మిస్తామని.. . విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. స్థపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణ పనులను చేపట్టనున్నారు.పెదపేటలో రామాలయ పునర్నిర్మాణ పనులు రోజు వారీ పర్యవేక్షణ బాధ్యతలను ఆకివీడుకు చెందిన మాణిక్యలరావు అనే వ్యక్తికి అప్పగిస్తున్నట్లు రఘురామ గతంలో ప్రకటించారు. వీరి కుటుంబమే దశాబ్దాలుగా పెదపేట రామాలయానికి కరెంట్ బిల్లు కడుతోందని రఘురామ తెలిపారు.భూమిని చదును చేసిన తర్వాత.. మే మూడో తేదీన ఉదయం 7 గంటల 14 నిమిషాలకు పండితుల సమక్షంలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని రఘురామ ప్రకటించారు. అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాలని ఆయన కోరారు. రామాలయ నిర్మాణం పట్ల పెదపేట ప్రాంతవాసులకు అభ్యంతరాలు లేవని.. సుదూరంగా ఉంటున్న కొందరే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.