ప్రపంచంలోని టాప్ 100 హాటెస్ట్ ప్రాంతాలు.. తెలంగాణ నుంచి మరో మూడు పట్టణాలు

Wait 5 sec.

తెలంగాణలోని భానుడు భగ్గుమంటున్నాడు. ఎంతలా అంటే.. తాకుతున్నాయి. అంతర్జాతీయంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టాప్-100 నగరాల జాబితాలో .. తాజాగా మరో మూడు తెలంగాణ పట్టణాలు ఈ జాబితాలోకి చేరాయి. రామగుండం, మంచిర్యాల, కొత్తపేట ప్రాంతాల్లో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడని ప్రాణ ఎయిర్ ఏక్యూఐ పోర్టల్ వెల్లడించింది. ఉష్ణోగ్రతల ఆధారంగా నిరంతరం మారుతూ ఉండే ఈ జాబితాలో.. శనివారం నాటి గణాంకాల ప్రకారం రామగుండం 59వ స్థానంలో నిలిచి గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారింది.జాబితాలోని ఇతర వివరాలను పరిశీలిస్తే.. మంచిర్యాల 64వ స్థానంలో, కొత్తపేట 76వ స్థానంలో, ఆదిలాబాద్ 91వ స్థానంలో నిలిచాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నుంచి 44.4 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్‌లోని బండా, మహారాష్ట్రలోని అకోలా, భుసావల్, జల్గావ్, రాజస్థాన్‌లోని జైసల్మేర్ నగరాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలోని చాలా నగరాలు ఈ జాబితాలో ఉండటం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్రమైన వడగాల్పుల పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ స్థాయి ఎండలు నమోదు కావడం భౌగోళికంగా ఆశ్చర్యకరం ఏమీ కాదని అంటున్నారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి సరిహద్దుగా ఉండే ఆదిలాబాద్, మంచిర్యాల వంటి జిల్లాలు సహజంగానే వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలని అంటున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) శాస్త్రవేత్త ధర్మరాజు వివరణ ప్రకారం.. ఈ ప్రాంతం 'హీట్ కోర్ జోన్' పరిధిలోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావం వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోతోంది. ముఖ్యంగా బొగ్గు గనులు, పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఉండే రామగుండం, మంచిర్యాల వంటి చోట్ల వేడి తీవ్రత మరింత అధికంగా ఉంది. ప్రభుత్వం, వాతావరణ శాఖ ఇప్పటికే ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని సూచించింది. భౌగోళిక కారణాలకు తోడు పొడి గాలుల ప్రభావం తోడవ్వడంతో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 29 వరకు రాష్ట్రంలో వేడి గాలులు వీస్తాయని చెప్పారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.