తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ రాష్ట్ర సేన పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పాత పేరు టీఆర్ఎస్ కలిసొచ్చేలా.. కవిత తన పార్టీకి ఈ పేరు పెట్టారు. తద్వారా టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు తానే వారసురాలినని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. గురించి విశ్లేషించే క్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ రాజకీయ పార్టీ విజయంతం కావడానికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. పార్టీకి బలమైన, చరిష్మా కలిగిన నాయకత్వం ఉండాలన్న ప్రొఫెసర్ నాగేశ్వర్.. క్షేత్రస్థాయిలో నిర్మాణం కూడా బలంగా ఉండాలన్నారు. పార్టీ ఏర్పాటుకు బలమైన కారణాలు ఉండాలని.. ఇతర పార్టీలు చేస్తున్న పనులు చేస్తూనే, అవి చేయలేని పనులు కూడా చేయాలన్నారు. అలాగే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పలేమని.. కానీ ఈ లక్షణాలు అవసరమన్నారు. ఇంకా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ, జాతీయ రాజకీయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కనుమరుగైంది. ఇవ్వాల్సిన టైంలో రాష్ట్రం ఇవ్వకపోవడంతో తెలంగాణలోనూ నష్టపోయింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌కు పదేళ్లు పట్టింది’’ అన్నారు.‘‘యూపీఏ-1 హయాంలో ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, విద్య హక్కు చట్టం, గృహ హింస చట్టం లాంటి అనేక ప్రజా అనుకూల చట్టాలను కాంగ్రెస్ పార్టీ తేవడంలో కీలక పాత్ర పోషించాయి. ఇవన్నీ కాంగ్రెస్ పట్ల, యూపీఏ పట్ల ప్రజల్లో సానుకూలత పెంచాయి. అయితే ప్రజలకు సంబంధం లేని అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకించి యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. వామపక్షాలకు తక్కువ సీట్లు వచ్చాయి. 2008 తర్వాత వామపక్షాల గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మళ్లీ ఇంత వరకూ ఆ పార్టీలు కోలుకోలేకపోయాయి’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు.‘‘2009లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వామపక్షాల ముందు ప్రజారాజ్యం పార్టీతో లేదా టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆప్షన్ ఉంది. కానీ లెఫ్ట్ పార్టీలు ప్రజారాజ్యాన్ని కాదని టీడీపీతో పొత్తుపెట్టుకున్నాయి. అయితే టీడీపీ ఓటర్లు వామపక్షాలను నమ్మలేదు. వామపక్షాల ఓటర్లు టీడీపీని నమ్మలేదు. దీంతో ఇద్దరూ మునిగారు. 2009లో గనుక లెఫ్ట్ పార్టీలు ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకొని ఉంటే.. అసలు కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వచ్చేది కాదు. రాష్ట్ర రాజకీయాలే మారిపోయేవి. అందువల్ల రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు, అనుసరించే ఎత్తుగడలు, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నారనే అనేక అంశాలు రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.కవిత ఇచ్చిన ఒక ఉపన్యాసంతోనే ఆమె రాజకీయ పార్టీ భవిష్యత్తును అంచనా వేయలేమన్న నాగేశ్వర్.. తాను మారిన టీఆర్ఎస్‌కు దూరం అయ్యాను కానీ టీఆర్ఎస్‌ లెగసీకి కాదని కవిత చెప్పకనే చెప్పిందన్నారు. ఆమె పార్టీ భవిష్యత్తు గురించి అప్పుడే ఒక నిర్ణయానికి రాలేమన్నారు.