ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. మూతపడుతున్న బంకులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. కొరత ఏర్పడిందనే భయాలతో వాహనదారులు ముందు జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు. అవసరాలకు మించి కొనుగోలు చేస్తూ ఉండటంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ ఏర్పడుతోంది. గుంటూరు జిల్లాలో డీజిల్ కొరత వాహనదారులను ఇబ్బందులు పెడుతోంది. పలు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ నోస్టాక్ బోర్డులు వెళిశాయి. మరికొన్ని చోట్ల పరిమితంగా ఇంధనం నింపుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నాయుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముంబయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ప్యానిక్ కొనుగోళ్ల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రానికి ఇంధన సరఫరా 10 శాతం అదనంగా పెరిగినప్పటికీ.. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేకచోట్ల పెట్రోల్ బంకుల్లో రద్దీ కనిపిస్తోందని ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని.. అయితే పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ఆందోళనతో వాహనదారులు భారీగా కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.శనివారం రోజున10,345 కిలో లీటర్ల పెట్రోల్, 14,156 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణంగా జరిగే కొనుగోళ్లతో పోలిస్తే ఏకంగా 50 శాతం పెరగటంతో పెట్రోల్ బంకుల వద్ద నిల్వలు అయిపోతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4510 పెట్రోల్ బంకులు ఉన్నాయని.. అయితే కొరత కారణంగా ఇందులో 421 పెట్రోల్ బంకులు మూతపడినట్లు చంద్రబాబుకు వివరించారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై తనకు నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అదేశించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయిల్ కంపెనీలు, డీలర్లతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులలో సమర్థంగా పనిచేయాలని.. ఇంధన సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఇంధన సరఫరాకు సంబంధించి కొన్నిచోట్ల సమస్యలు తలెత్తాయన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. జిల్లాల్లోని జాయింట్ కలెక్టర్లు ఆయిల్ కంపెనీల డిపోల వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టాలని సూచించారు. సరఫరాలో ఆలస్యం లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.