'2029లో మన పార్టీ నేతే సీఎం'.. పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలకు దండం పెట్టిన నారా లోకేష్

Wait 5 sec.

తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. మంగళగిరిలో అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ప్రసంగించారు. ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. టీడీపీ తదుపరి ఫోకస్ అంతా 2029 ఎన్నికలపైనే ఉండాలని సూచించిన పల్లా శ్రీనివాస్.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడే ఉంటారని తేల్చి చెప్పారు. అయితే పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో అక్కడే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతూ.. మళ్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది చెబితే కూటమిలో విబేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి నేతలు భావించారు. ఈ నేపథ్యంలోనే పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు విన్న మంత్రి నారా లోకేష్.. రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ.. ఏవో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో కూటమిలో కొత్త పంచాయితీ తీసుకురాకు అన్నట్లుగా అది అర్థం అవుతోంది.ఇక అంతకుముందు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేసిన నారా లోకేష్.. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. టీడీపీ నేతలపై చాలా కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం వల్లే ప్రస్తుతం.. అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణుల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వెల్లడించారు.వైసీపీ సినిమా.. విధ్వంసం అని.. టీడీపీ సినిమా.. అభివృద్ధి అని నారా లోకేష్ పంచ్ డైలాగ్‌లు వేయడంతో అక్కడే ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. వైసీపీ సినిమాకు ఎండ్‌ కార్డ్‌ వేసేది పసుపు సైన్యమే అంటూ చేసిన వ్యాఖ్యలతో వారిలో జోష్ రెట్టింపైంది. అహంకారం ఎక్కువైతే ఏం జరుగుతుందో 2024లో వైసీపీలో చూశామని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు క్రెడిట్‌ చోరీ జబ్బు ఉందని.. వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని హితవు పలికారు. టీడీపీలో కష్టపడి పనిచేస్తే సాధారణ కార్యకర్త కూడా పొలిట్‌బ్యూరోలోకి వస్తారని నారా లోకేష్ వెల్లడించారు.తెలుగువారికి గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని.. ఇక తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని నారా లోకేష్ కొనియాడారు. చాలా సార్లు కిందపడ్డామని.. మళ్లీ లేచామని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎప్పుడూ అధైర్యపడలేదని.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే పార్టీ బలమని తేల్చి చెప్పారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి తనకు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నారా లోకేష్ వెల్లడించారు. ఎన్నికలకు ముందు చేసిన యువగళం పాదయాత్రలో అనేక వర్గాల సమస్యలు తెలుసుకున్నానని.. ఒక్కడినే చేస్తాననే అహంకారం తనకు లేదని.. అంతా కలిసి పనిచేద్దామని తెలిపారు. మహానాడులో 6 నిర్ణయాలు తీసుకున్నామని.. వాటిని తప్పకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి.. వాటిని పరిష్కరించాలని సూచించారు. పార్టీ శ్రేణులు చేస్తున్న పనులను తెలుసుకోవాలనే ‘మై టీడీపీ’ యాప్‌ తీసుకువచ్చినట్లు లోకేష్ స్పష్టం చేశారు.