తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని సర్వేలు డీఎంకే కూటమిదే మళ్లీ అధికారమని అంచనా వేశాయి. కానీ, ఒక్క సంస్థ మాత్రం దళపతి టీవీకే మెజార్టీ స్థానాల్లో గెలిచి, అధికారం చేపడుతుందని తెలిపింది. విజయ్‌ పార్టీ సునామీ తథ్యమని జోస్యం చెప్పింది. ఆ సంస్థ అంచనా ప్రకారం 98 నుంచి 120 స్థానాలు, డీఎంకే కూటమి 92 నుంచి 110, అన్నాడీఎంకే కూటమి 22 నుంచి 30 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. ఆ సర్వే అంచనా నిజమైతే విజయ్ ముఖ్యమంత్రి అవుతారు. అయితే, తుది ఫలితాలు అంచనాలకు దగ్గరగా ఉంటాయా? లేదా? అనేది మే 4న తేలిపోనుంది. అంతేకాదు, అంచనాలు తారుమారై డీఎంకే కూటమి మెజార్టీ మార్క్‌కు దగ్గరగా ఆగిపోతే విజయ్‌ మద్దతు కీలకమవుతుంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, గతంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా సర్వేలు నిజమయ్యాయి. గతంలో ఐదు సందర్భాల్లో మిగతా సంస్థలకు భిన్నంగా దీని అంచనాలు, ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 359 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, గతేడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఖచ్చితంగా అంచనా వేసింది. మధ్యప్రదేశ్‌లో అన్ని సర్వేలూ కాంగ్రెస్‌ గెలుస్తుందని చెబితే.. యాక్సిస్ మై ఇండియా మాత్రం 140- 162 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. అన్నట్టుగానే బీజేపీ 163 సీట్లతో మళ్లీ అధికారం నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ ఓట్ల లెక్కింపు రోజున వాస్తవ ఫలితాలుగా మారనప్పటికీ, అవి ప్రజా చర్చను ప్రభావితం చేస్తూ, తుది తీర్పుపై ఉత్కంఠను పెంచుతాయి. మరి ఈసారి కూడా ఈ సంస్థ అంచనాలు నిజమవుతాయా? అనేది మే 4న తెలుస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన విజయ్.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఈ సర్వే అంచనా వేసినట్టు ఫలితాలు ఉంటే.. విజయ్ చరిత్రను తిరగరాయనున్నారు.