డీజిల్ కొరత.. పెట్రోల్ బంకుల వద్ద వాహనాల క్యూ.. ట్రేడర్స్ ఫెడరేషన్ ఏం చెప్తోందంటే?

Wait 5 sec.

ఏపీవ్యాప్తంగా శుక్రవారం రోజున పలుచోట్ల డీజిల్‌ కొరత తలెత్తింది. దీంతో కొన్నిచోట్ల పెట్రోల్‌ బంకులు మూతపడుతున్నాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు డీజిల్ సరఫరాను తగ్గించటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. క్రెడిట్‌ సౌకర్యం రద్దు చేయటమే ఈ ఇబ్బందులకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా డీజిల్ సరఫరా తగ్గించటంతో ఉభయగోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో డీజిల్‌ కొరత నెలకొంది. ప్రభావం గోదావరి జిల్లాలపై ఎక్కువగా పడుతోంది. వరికోతల సమయంలో డీజిల్ దొరక్కపోవటంతో యంత్రాలు పనిచేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్‌ లభించకపోవటంతో రొయ్యలు, చేపల సాగు చేపట్టే్ ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కొరత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలుమరోవైపు సమస్యను పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్, చమురు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అదనంగా పది శాతం ఇంధనం సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వెల్లడించింది. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా పెరగనున్న నేపథ్యంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని స్పష్టం చేసింది. స్టాక్ లేదని ప్రజలు కంగారుపడాల్సిన అవసరం లేదని సూచించింది.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులలో ఇంధన కొరత లేకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు. ఇంధన పంపిణీలో ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తినా, సరఫరా అగిపోయినా డీలర్లు వెంటనే స్పందించాలని సూచించారు. 1967 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చని తెలిపారు. అన్ని బంకులలో త్వరలోనే ఇంధన కొరత లేకుండా సాధారణ స్థితికి తీసుకువస్తామని వెల్లడించారు. మరోవైపు ఏపీలో డీజిల్ కొరతతో.. వాహనదారులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు క్యూ కడుతున్నారు.