ప్రముఖ పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణపై గొర్రెల కాపర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాఘవాపురంలో తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిలో గత ఆరు దశాబ్దాలుగా ఒక కృత్రిమ అడవిని సృష్టించారు. ఎందరో విద్యార్థులు, పరిశోధకులు పర్యావరణంపై ఇక్కడ అధ్యయనాలు చేస్తుంటారు. అయితే.. ఈ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి చెట్లను నరుకుతూ గొర్రెలను మేపుతున్న సమీప రైతులు బయ్య గంగయ్య, మల్లయ్యలను సత్యనారాయణ వారించారు. పర్యావరణాన్ని నాశనం చేయవద్దని చెప్పిన ఒక్క మాటకు ఆగ్రహించిన గంగయ్య, మల్లయ్య.. తమ కుటుంబ సభ్యులతో కలిసి దుశ్చర్ల సత్యనారాయణ సృష్టించిన అడవికి వెళ్లారు. అక్కడ సేద తీరుతున్న ఆయనపై ఒక్కసారిగా భౌతిక దాడికి దిగారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఈ దాడిలో ఆయన తల పగిలింది. అయినా అలాగే అమానుషంగా దాడి చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొర్రెల కాపర్ల దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ చెట్టు కింద కూర్చున్న సత్యనారాయణను వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. తనపై దాడికి పాల్పడిన గంగయ్య, మల్లయ్య, రోషాలు, సుమలత, యశ్వంత్, అనూషలపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మోతె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుశ్చర్ల సత్యనారాయణ కేవలం పర్యావరణవేత్త మాత్రమే కాదు, సామాజిక ఉద్యమకారుడు కూడా. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆయన.. ప్రకృతిపై ఉన్న మక్కువతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను వణిక్కించిన ఫ్లోరైడ్ సమస్యపై జల సాధన పేరుతో పోరాటం చేశారు. తన 70 ఎకరాల భూమిని మూగజీవాలకు ఆవాసంగా మార్చేందుకు ఐదెకరాల్లో ప్రత్యేకంగా పంటలు సాగు చేయడం, పక్షులు, జంతువుల తాగునీటి కోసం ఏడు చోట్ల కుంటలు తవ్వించడం వంటి ఎన్నో గొప్ప పనులు చేపట్టారు. జీవ వైవిధ్యానికి జీవం పోస్తూ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. సత్యనారాయణ సృష్టించిన అడవిని ధ్వంసం చేయడమే కాకుండా, దానిని సృష్టించిన వ్యక్తిపైనే దాడి చేయడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను వివిధ ప్రజా సంఘాలు, ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రకృతిని రక్షించే వ్యక్తికే రక్షణ లేకుండా పోయిందని నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.