ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇప్పటి వరకు 100 పరుగుల తేడాతో ఓడిపోయిన దాఖలాలే లేవు. కానీ ఫస్ట్ టైమ్ అది కూడా, ముంబై హోం గ్రౌండ్‌లోనే సీఎస్కే చిత్తుగా ఓడించింది. చెన్నై భారీ విజయం సాధించడానికి సంజూ శాంసన్ ఒక కారణమైతే.. అసలు హీరోలు మాత్రం ఆ ఇద్దరే. మొన్నటి వరకు బౌలింగ్‌లో వీక్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ రావడంతో కాస్త స్ట్రాంగ్ అయింది. పేస్ బౌలర్లు గాయపడి ఏకంగా జట్టునే వీడటంతో కంగారు పడిన చెన్నైకి అకేలా హోసెన్ ఆణిముత్యంలా దొరికాడు. అతనితో పాటు మరో స్విన్ మాంత్రికుడు కూడా తోడవ్వడంతో చెన్నై విజయాలతో దూసుకుపోతోంది. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో స్పిన్ ద్వయం అకేలా హోసెన్, నూర్ అహ్మద్ సీఎస్కే రియల్ హీరోస్‌గా మారారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్‌కి ఈ ఇద్దరు స్పిన్నర్లు దడ పుట్టించారు. ఎనిమిది ఓవర్లు వేసిన ఈ ఇద్దరూ కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టారు. టాప్ ఆర్డర్‌ను అకేలా హోసెన్ కుప్పకూల్చగా.. హిట్టర్లను నూర్ అహ్మద్ ఇంటికి పంపించేశాడు. తొలి ఓవర్ అందుకున్న అకేలా హోసెన్ యువ ఆటగాడు దానిష్ మాలేవర్‌ని డకౌట్ చేయగా.. ఆ వెంటనే నమన్ ధీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఫామ్‌లో ఉన్న నమన్ ధీర్, తిలక్ వర్మ అకేలా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం. నాలుగు ఓవర్లు వేసిన అకేలా ఒక ఓవర్ మేడిన్ చేసి 17 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే తర్వాత బంతిని అందుకున్న నూర్ అహ్మద్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దక్ పాండ్యాను రెండో బంతికే పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత హార్డ్ హిట్టర్ షేర్ఫేన్ రూధర్‌ఫోర్డ్‌ను కూడా అవుట్ చేసి ముంబై 104 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన నూర్ అహ్మద్ 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లతో పాటు మిగతా నలుగురు పేసర్లు కూడా రాణించారు. ముకేశ్ చౌదరి నాలుగు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగా, అన్షుల్ కాంబోజ్ మూడు ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. జెమీ ఓవర్టన్, గుర్‌జపనీత్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.