తిరుమల రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా.. భక్తులకు మరో ఛాన్స్.. హోమం టికెట్లు బుక్ చేసుకోండి

Wait 5 sec.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి, ఆర్జిత సేవల కోసం టీటీడీ టికెట్లు జారీ చేస్తుంది. ప్రతి నెలా ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ అంగ ప్రదక్షిణ, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులు విడుదల చేస్తుంది. వీటితో పాటుగా దివ్య దర్శనం, సర్వ దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్కువమంది భక్తులు ప్రతి నెలా టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఈ టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు భక్తులకు దొరకని పరిస్థితి. ఈ రూ.300 దర్శన టికెట్లు దొరకకపోయినా పర్లేదు.. వీరికి మరో అద్భుత అవకాశం కల్పిస్తోంది టీటీడీ.టీటీడీ ప్రతి రోజు అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తోంది. ఈ హోమం టికెట్లను ప్రతి నెలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. భక్తులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకుంటే రూ.300 ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్‌ను రూ.1600తో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.. హోమంలో పాల్గొనేందుకు ఇద్దరిని అనుమతిస్తారు. అలిపిరిలో సప్తగోప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొన్న తర్వాత.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. టీటీడీ మే నెలకు సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 25న (శనివారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.తిరుమలలో గంధపు పొడి ఉత్సవతిరుమలలో శ్రీ భాష్యకార్ల ఉత్సవాల్లో భాగంగా గంధపు పొడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాధారణంగా శ్రీ భాష్యకార్ల సాత్తుమొర తర్వాత రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం భాష్యకార్లుగా పిలువబడే ప్రముఖ శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవ మూర్తికి గంధపు పొడితో అభిషేకం చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా భాష్యకార్ల వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.తిరుమలలో పరిణయోత్సవాలుతిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల వంటి ఆధ్యాత్మిక రూపాలతో దాదాపు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారని టిటిడి ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. పుణెకకు చెందిన శ్రీ వేంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ రూ.30 లక్షలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై, రెండవరోజు అశ్వవాహనంపై, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కల్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు.