హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు తీపి కబురు. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు 7.1 కిలోమీటర్ల మేర ను నిర్మించనున్నట్లు రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. సుమారు 20 లక్షల మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని.. ఈ ప్రాంతంలోని 54 కాలనీల వాసులకు ట్రాఫిక్ నుంచి బిగ్ రిలీఫ్ దక్కుతుందని మంత్రి తెలిపారు.ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.200 కోట్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు, వాహనాల రాకపోకలకు వీలుగా డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు ఎల్బీనగర్ నుంచి నగరాన్ని కేవలం 15 నిమిషాల్లోనే దాటి వెళ్లే అవకాశం ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.సెక్రటేరియట్‌లో గురువారం (ఏప్రిల్ 23) మోర్త్, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రాజెక్టు రూపకల్పన, భూసేకరణ, నిర్మాణ ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ తూర్పు ప్రాంతం అభివృద్ధిలో కీలక మార్పులు రానున్నాయని చెప్పారు. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పనిలేకుండా వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. ఏపీ-తెలంగాణ మధ్య వేగవంతమైన ప్రయాణంఇక తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారిలో కొంత భాగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలోని వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పొంగుటూరు వరకు సుమారు 116 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇదొక ప్రధాన మైలురాయి అని అన్నారు. ఈ రహదారికి సంబంధించి ఐదు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయన్నారు. ప్యాకేజీ-1 తల్లంపాడు-సోమవరం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు. ప్యాకేజీ-5 కొయ్యలగూడెం-దేవరపల్లి పరిధిలో రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తుది అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను 2026 జూన్ నాటికి పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది.