ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం చేసే టాప్ 5 దేశాల్లో భారత్

Wait 5 sec.

రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే నిలిచింది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది భారత్ రక్షణ రంగ వ్యయం గణనీయంగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ 92.1 బిలియన్ డాలర్లు (అంటే దాదాపు రూ.8.6 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్టు నివేదిక పేర్కొంది. అంతకు ముందు ఏడాది 2024తో పోల్చితే ఇది 8.9 శాతం అధికమని సిప్రీ నివేదిక పేర్కొంది. ప్రపంచం మొత్తం సైనిక వ్యయంలో భారత్ వాటా 3.2 శాతంగా ఉందని వివరించింది. సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ రంగం కోసం అమెరికా ఖర్చు చేస్తోంది. గతేడాది ఏకంగా 954 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.87.8 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. దాని తర్వాతి 336 బిలియన్ డాలర్ల (రూ.31.6 లక్షల కోట్లు)తో రెండో స్థానంలో చైనా, 190 బిలియన్ డాలర్ల (రూ.17.9 లక్షల కోట్లు)తో మూడో స్థానంలో రష్యా, 114 బిలియన్ డాలర్ల (రూ.10.7 లక్షల కోట్లు)తో నాలుగో స్థానంలో జర్మనీ, ఈ ఐదు దేశాల మొత్తం వ్యయం (2,888 బిలియన్ డాలర్లు) ప్రపంచ రక్షణ రంగంలో 58% వాటా కలిగి ఉన్నట్టు నివేదిక తెలిపింది. అమెరికా, చైనా, రష్యా ఈ మూడు దేశాలదే (మొత్తం 1,480 బిలియన్ డాలర్లు) 51 శాతం వాటా కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, దాయాది పాకిస్థాన్ కూడా తన రక్షణ బడ్జెట్‌ను పెంచింది. 2025లో పాక్ రక్షణ రంగ వ్యయం 11 బిలియన్ డాలర్లు (రూ.1.03 లక్షల కోట్లు)గా ఉంది. 2024 ఏడాదితో పోల్చితే ఇది 11 శాతం అధికం. ప్రపంచంలోని మొత్తం 40 దేశాలతో కూడిన సిప్రీ విడుదల చేసిన నివేదికలో పాకిస్థాన్ 31వ స్థానంలో ఉంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టి ఆపరేషన్ సిందూర్ కారణంగానే భారత్, పాకిస్థాన్ రక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. చైనా, పాకిస్థాన్ నుంచి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.2025లో ప్రపంచ సైనిక వ్యయం 2,887 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే 2.9 శాతం పెరుగుదల. ఇది ప్రపంచ జీడీపీలో 2.5 శాతానికి సమానం. 2009 తర్వాత ప్రపంచ సైనిక వ్యయంలో ఇదే అత్యధిక వాటా కావడం గమనార్హం. ఐరోపా వ్యయం 14% పెరిగి 864 బిలియన్ డాలర్లకు చేరింది. ఆసియా-ఓషియానియా వ్యయం 8.1% పెరిగి 681 బిలియన్ డాలర్లకు చేరింది. బెల్జియం, స్పెయిన్, నార్వే, డెన్మార్క్, పోలాండ్, కెనడా వంటి నాటో దేశాలలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. జర్మనీ వ్యయం 24% పెరగడంతో ప్రపంచంలోనే నాల్గో స్థానానికి చేరింది.ఆయుధ దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ ఇది రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. మార్చిలో ఆయుధ బదిలీలపై సిపీ మరో నివేదికను విడుదల చేసింది. 2016-20 నుంచి 2021-25 మధ్య భారతదేశ ఆయుధ దిగుమతులు 4 శాతం తగ్గాయని పేర్కొంది. అయినప్పటికీ, ప్రపంచ దిగుమతులలో 8.2 శాతం వాటాతో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలిచింది. అంతేకాదు క్రమంగా రష్యా నుంచి దిగుమతుల వాటా తగ్గడం గమనార్హం. 2011-15 మధ్య 70% ఉండగా.. 2016-20 నాటికి 51%, 2021-25 నాటికి 40% పడిపోయింది. రష్యా నుంచి తగ్గించి ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికాల నుంచి ఆయుధాల దిగుమతులను భారత్ పెంచుతోందని నివేదిక వివరించింది.