మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్

Wait 5 sec.

బిగ్ ట్విస్ట్ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్‌ రోహిత్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కండిషన్లతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత.. నిత్యం .. దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని షరతు విధించింది. అంతేకాకుండా ఆయన విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు.. పైలట్ రోహిత్ రెడ్డి.. తన పాస్‌ పోర్టును పోలీసులకు సరెండర్‌ చేయాలని పేర్కొంది. అదే సమయంలో దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు పైలట్ రోహిత్ రెడ్డిని ఆదేశించింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయొద్దని తేల్చి చెప్పింది. మార్చి నెలలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందని అందిన సమాచారంతో రంగంలోకి దిగిన తెలంగాణ ఈగల్ టాస్క్‌ఫోర్స్‌, పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. ఈ కేసులో పైలట్ రోహిత్‌ రెడ్డితోపాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన బిజినెస్‌మెన్ నమిత్ శర్మలను మార్చి 14వ తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేసి మత్తు పదార్థాలను సేవించడంతోపాటు దాడులకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. పైలట్‌ రోహిత్‌ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను ఇప్పటికే పోలీసులు పలుమార్లు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఇప్పటికే రోహిత్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఉప్పర్‌పల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో తన బెయిల్ పిటిషన్‌ను పైలట్ రోహిత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ నెల 8వ తేదీన దాఖలు చేసిన పైలట్ రోహిత్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే హైకోర్టులో వాదనలు ముగియగా.. తాజాగా షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పైలట్ రోహిత్ రెడ్డి రేపు జైలు నుంచి బయటికి రానున్నట్లు తెలుస్తోంది.