హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు హాట్ టాఫిక్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సమాచార కమిషనర్, ప్రముఖ మెడికల్ కాలేజ్ యజమాని అయిన ఒక మహిళ తన కుమార్తెతో పెళ్లి నిశ్చయమైన ఫార్మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ కుటుంబంపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. మొదట కట్నం వద్దని చెప్పిన వరుడి కుటుంబం.. నిశ్చితార్థం తర్వాత భారీ డిమాండ్లు పెట్టిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఫిబ్రవరిలో జరిగిన సుమారు రూ. 55 లక్షలు ఖర్చు చేశారు. వరుడికి రూ. 50 లక్షల విలువైన చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే, ఆ తర్వాత వరుడి సోదరికి ఖరీదైన బహుమతులు, తల్లికి రూ. కోటి నగదు, వరుడి పేరు మీద రూ. 3 కోట్ల విలువైన BMW M5 కారుతో పాటు హైటెక్స్‌లో అత్యంత వైభవంగా పెళ్లి చేయాలని డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. రూ. 15 లక్షలు చెల్లించి పెళ్లి వేదికను బుక్ చేసినప్పటికీ.. ఏప్రిల్ 5న వరుడి కుటుంబం కారణం చెప్పకుండానే పెళ్లిని రద్దు చేసిందని ఆమె పోలీసులకు తెలిపారు.'మెుదట్లో పెళ్లి కొడుకు కుటుంబం తమకు కట్నంపై ఆసక్తి లేదని చెప్పింది. కానీ తర్వాత వైభవంగా పెళ్లి చేయాలని, పెళ్లికొడుకు సోదరికి బహుమతులు, పెళ్లికొడుకు తల్లికి కోటి రూపాయలు, పెళ్లికొడుకు పేరు మీద సుమారు 3 కోట్ల రూపాయల విలువైన BMW M5 కారు కావాలని డిమాండ్ చేశారు. పెళ్లిని హెటెక్స్‌లో జరపాలని కోరారు. మా అబ్బాయి సంవత్సరానికి సుమారు రూ.2 కోట్ల జీతం తీసుకుంటున్నారని.. ఫార్మా కంపెనీలో ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ పదవి రేసులో ఉన్నట్లు అతని కుటుంబం చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారు 400 మంది అతిథులు హాజరైన నిశ్చితార్థం కోసంరూ.55 లక్షలు ఖర్చు చేశాం. మేం రూ.50 లక్షల విలువైన పాటెక్ ఫిలిప్ వాచ్ ఇచ్చాం. BMW M5 కారును కొనిచ్చాం. జూన్ 24న జరగాల్సిన పెళ్లి కోసం హైటెక్స్‌లో వేదికను బుక్ చేశాం. కానీ ఇప్పుడు సడెన్‌గా పెళ్లిని రద్దు చేసుకున్నారు.' అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అతని తల్లిదండ్రులు, సోదరిపై కేసు నమోదు చేశారు.మరోవైపు వరుడి తండ్రి రిటర్న్ కేసు పెట్టారు. ఏప్రిల్ 24న సదరు మహిళ తన కుమారుడితో పాటు మరో 70 మంది అనుచరులతో జూబ్లీహిల్స్‌లోని తమ నివాసానికి వచ్చి దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి.. వాచ్‌మన్‌పై దాడి చేశారని ఆయుధాలతో బెదిరిస్తూ ఇంటిలోని సీసీటీవీ కెమెరాలను, ఆస్తులను ధ్వంసం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. తాము ఇంట్లో లేని సమయంలో ఈ దాడి జరిగిందని ఆయన వివరించారు. రెండు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు.. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.