హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, కొన్ని రకాల మోసాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే వీడియోలు, పోస్ట్‌లు, ట్వీట్లు చేసే సీపీ సజ్జనార్.. తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు బైక్‌పై వెళ్లిన ఓ యువకుడు.. అక్కడే ఉన్న అమ్మాయిలను చూసి రెచ్చిపోయి.. వారిని ఇంప్రెస్ చేయడానికి అక్కడ చేసిన స్టంట్లకు సంబంధించిన వీడియోను సీపీ చేశారు. ఇలా చేయడం వల్ల రోడ్లపైకి వచ్చే అమాయక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. 'వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం. మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా. గుర్తుంచుకోండి.. మీరు చేసే Wheelings ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి ఫీలింగ్స్ మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి' అంటూ సీపీ తీవ్రంగా హెచ్చరించారు. ఓ యువకుడు పెట్రోల్ బంక్ వద్ద బైక్‌పై వచ్చి ఓవర్ యాక్షన్ చేసిన వీడియో వైరల్ కావడంతో సీపీ సజ్జనార్ ఆ వీడియోను ట్వీట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్డప్ కోసం అమ్మాయిల ముందు డేంజరస్‌గా బైక్ స్టంట్ చేసిన ఆ యువకుడు.. చివరికి చెంప దెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది. వైరల్ వీడియోలో ఉన్న ప్రకారం.. పెట్రోల్ కొట్టించుకునేందుకు ఇద్దరు యువకులు బైక్‌పై పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుంటారు. అయితే వారి కంటే ముందు ఒక వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ పోయించుకుంటాడు. అక్కడే ఇద్దరు యువతులు ఉండగా.. వారిని చూసిన ఆ యువకుడు.. తన బైక్‌ ముందు టైర్‌ను గాల్లోకి లేపి.. బ్యాలెన్స్ మొత్తం వెనుక టైర్‌పై ఉంచుతాడు. అయితే అది కాస్తా బెడిసికొట్టడంతో.. బైక్ మొత్తం లేచి గాల్లో నిలబడుతుంది. అంతేకాకుండా వారి ముందు పెట్రోల్ కొట్టిస్తున్న వ్యక్తికి ఆ బైక్ తగలడంతో అతడు తీవ్ర ఆగ్రహంతో.. ఆ యువకుడి చెంపపై వాయిస్తాడు. దీంతో అక్కడ ఉన్న వారు కూడా ఆ యువకుడు చేసిన పనికి తిట్లు తిడతారు. ఈ వ్యవహారం మొత్తం ఆ పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ కాగా.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.ఇక ఆ వీడియోను సీపీ సజ్జనార్ పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. పరువు మొత్తం అమ్మాయిల ముందు పోయిందిగా కామెంట్లు చేస్తున్నారు. పరువుతోపాటు ఒక చెంప దెబ్బ ఎక్స్ ట్రా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు అంటూ మరికొందరు పేర్కొన్నారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఏం జరగలేదని.. ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు.