విజయవాడ ఇంద్రకీలాద్రిపై దారుణం.. లేడీస్ బాత్రూంలో ఆగంతకుడు, వీడియోలు రికార్డ్

Wait 5 sec.

పవిత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమానుష ఘటన జరిగింది. ఆలయం ప్రాంగణంలో ఉన్న లేడీస్ బాత్రూంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. రహస్యంగా అందులోకి వచ్చే మహిళల వీడియోలను చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం బట్టబయలు అయింది. ఆ వ్యక్తిని గుర్తించిన మహిళలు.. అతడిని కొట్టి పోలీసులకు పట్టించారు. దీంతో అతడి గురించి ఆరా తీసిన పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం ఆ వ్యక్తి సెల్‌ఫోన్ తీసుకుని.. అందులో ఉన్న డేటాను పరిశీలించారు. విజయవాడ ఆలయంలో ఇలాంటి ఘటన జరగడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ ఆలయంలోని మహామండపం 6వ అంతస్థులో ఉన్న ఆడవాళ్ల బాత్రూమ్‌లోకి నరేష్ అనే 20 ఏళ్ల యువకుడు చొరబడ్డాడు. బాత్రూమ్‌లోకి వచ్చే మహిళల వీడియోలను తన సెల్‌ఫోన్‌లో చిత్రికరించే ప్రయత్నం చేసినట్లు కొందరు మహిళలు ఆరోపించారు. వెంటనే నరేష్‌ను పట్టుకున్న మహిళలు చితక్కొట్టారు. మహిళలు కేకలు వేయడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నరేష్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత స్ధానిక పోలీస్ స్టేషన్‌లో మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు.దీంతో నరేష్‌‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నరేష్‌ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పటినుంచి ఆ బాత్రూంలో ఉన్నాడు అని ఆరా తీశారు. ఈ క్రమంలోనే నరేష్ సెల్‌ఫోన్ డేటాను విజయవాడ వన్ టౌన్ పోలీసులు పరిశీలించారు. అందులో ఎవరైనా మహిళల వీడియోలు ఉన్నాయా అని చెక్ చేశారు. నరేష్ చిట్టి నగర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.