హైదరాబాద్‌ శివారులో ఘోర ప్రమాదం.. ఈదురు గాలులకు క్రేన్ కుప్పకూలి ఐదుగురు కార్మికులు మృతి

Wait 5 sec.

హైదరాబాద్‌ శివార్లలో ఉన్న శంకర్‌పల్లి మండలంలో ఘోరం జరిగింది. మహాలింగాపురం గ్రామంలో ఉన్న ఎన్‌సీసీ సిమెంట్ ఇటుక బట్టీలో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటివరకు దంచికొట్టిన సూర్యుడు.. మేఘాల వెనక్కి వెళ్లిపోవడంతో.. వాతావరణం చీకటిగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిశాయి. మరికొన్ని చోట్ల గాలి, దుమారం వీచింది. ఈ నేపథ్యంలోనే సిమెంట్ ఇటుక ఫ్యాక్టరీలో భారీ గాలులకు ఓ భారీ క్రేన్ కూలిపోయింది. దీంతో ఆ క్రేన్ కింద చిక్కుకుని.. కొందరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో.. చిమ్మ చీకట్లలా మబ్బులు కమ్మేశాయి. అదే సమయంలో భారీ ఎత్తున ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి.. ఎన్‌సీసీ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో ఉన్న ఓ భారీ క్రేన్ కూలింది. ఈ దుర్ఘటనలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అంబులెన్స్‌లలో బాధితులను శంకర్‌పల్లి ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కార్మికులు ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇటుక బట్టీలో మొత్తం 13 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మొత్తం ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులు చనిపోగా.. తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతున్న వారు ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం పూట కార్మికులు మొత్తం విధుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ కంపెనీలోని భారీ క్రేన్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి కార్మికులపై పడిపోయింది. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ సిమెంట్ ఇటుక కంపెనీలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి అనేదానిపై విచారణ జరుపుతున్నాయి.