అంగన్వాడీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపారు. మంత్రి సంధ్యారాణి సోమవారం పార్వతీపురంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మినీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్‌గ్రేడ్‌ చేశారని పేర్కొన్నారు. వాటిల్లో పనిచేసే ఆయాలకు తీసుకున్నారని మంత్రి వివరించారు. వీరికి టీచర్‌ హోదా ఇచ్చి, చట్టబద్ధమైన జీతాలు, విధులు కల్పించనున్నట్లు వివరించారు. ఈ సెంటర్లలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. మొదటి విడతలో 2,645 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన పోస్టులను రెండో విడతలో భర్తీ చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మొత్తంగా 5 వేల ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. నియామకాలు పారదర్శకంగా చేపడతామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 257 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత వేగంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మొత్తం 58,204 మంది కార్యకర్తలు , సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు ఇటీవలే ప్రభుత్వం స్మార్ట్ 5 జీ ఫోన్లు అందించింది. కాగా, కేంద్రం ప్రారంభించిన ప్రధాన మంత్రి జీవనజ్యోతి యోజన, సురక్ష బీమా యోజనను అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకువర్తింపజేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల అంగన్వాడీ కార్యకర్తలకు ప్రయోజనం కలగనుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి పీఎం జీవనజ్యోతి యోజన వర్తింపజేస్తున్నారు. అయితే, ఈ పథకం కింద ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం లేదా సహజ మరణం సంభవించినా రూ. 2 లక్షలు బీమా వస్తుంది.