కార్యకర్తలతో సమావేశమైన గులాబీ బాస్, మాజీ సీఎం .. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీలో క్రమశిక్షణ లేని నేతలకు గట్టి హెచ్చరికలు చేశారు. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఇచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. పార్టీ లైన్ తప్పిన వారిపై కొరఢా తప్పదని తేల్చి చెప్పారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా.. గులాబీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినా ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హడావిడి చేసే నేతలకు ఈసారి కేసీఆర్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. నెట్టింట డ్రామాలతో ప్రజలను, పార్టీలను మోసం చేసే ప్రయత్నాలు ప్రతీసారి పనిచేయవని బీఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు ఎలా పనిచేస్తున్నారో చూసి.. వారికి పార్టీలో, పదవుల్లో గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక పార్టీ మారే ఆలోచన చేస్తున్న పలువురు నేతలకు కూడా ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరికలు చేశారు. అటువైపో కాలు.. ఇటువైపో కాలు వేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. నేతలంతా పార్టీ పట్ల పూర్తి నిబద్ధతతో ఉండాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో కొత్త కమిటీల ఏర్పాటు విషయంలో కేసీఆర్ కీలక సూచనలు చేశారు. చురుగ్గా పనిచేసే కార్యకర్తలకు మాత్రమే ఈ కొత్త కమిటీల్లో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కేవలం నేతలకు నచ్చిన వారికో లేదా వారి సన్నిహితులకో పదవులు ఇస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ కమిటీల ఎంపికలో ఎవరికైనా అన్యాయం జరిగితే స్వయంగా తనకే ఫిర్యాదు చేయాలని గులాబీ కార్యకర్తలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. అలాంటి ఫిర్యాదులను స్వయంగా తానే పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలకు.. కొత్త వారికి ఈ కొత్త కమిటీల్లో పెద్దపీట వేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు.. రానున్న ఎన్నికలకు సంబంధించి ఇవ్వాల్సిన టికెట్ల విషయంలో ఇప్పటి నుంచే కేసీఆర్ స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. సిట్టింగ్ నేతలు అనేది ముఖ్యం కాదని.. పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి, నియమాలను పాటించే వారికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీకి విరుద్ధంగా ఎవరైనా పనిచేస్తే.. సిట్టింగ్‌లకు కూడా సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా సమావేశం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలకు స్వస్తి చెప్పడమే కాకుండా.. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయడమే తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.