సుప్రీంకోర్టులో హైడ్రాకు ఎదురుదెబ్బ.. బతుకమ్మకుంటలో బోర్డులు, శిలాఫలకాలు తొలగింపు

Wait 5 sec.

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో ఉన్న బతుకమ్మకుంట భూవివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే అక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం, శిలాఫలకాలు పెట్టడంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. బతుకమ్మకుంటలో ఏర్పాటు చేసిన బోర్డులు, శిలాఫలకాలను తొలగించారు. అంబర్‌పేటలో ఉన్న బతుకమ్మకుంటలో సుమారు 7 ఎకరాల స్థలం విషయంలో ఎడ్ల సుధాకర్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ విషయం కాస్తా కోర్టు వరకు వెళ్లడంతో ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన.. హైడ్రా.. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే.. బతుకమ్మకుంటను తమ అధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి.. అభివృద్ధి పనులు చేయడం కోసం శంకుస్థాపన శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేసింది. అది ప్రభుత్వ భూమి అని పేర్కొన్న హైడ్రా అధికారులు.. సుమారు 5 ఎకరాల్లో చిన్న పిల్లలకు పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేసి డెవలప్ చేసింది. ఈ క్రమంలోనే వీటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గతేడాది ప్రారంభించి.. ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలోనే అది ప్రభుత్వ స్థలం కాదని.. తన వ్యక్తిగత ఆస్తి అంటూ.. ఎడ్ల సుధారక్ రెడ్డి వాదిస్తున్నారు. అది ఎప్పుడూ కుంట కాదని న్యాయపోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ.. హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకోవడం.. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈ స్థలం విషయంలో స్టేటస్ కో విధించింది. అయితే ఈ స్టేటస్ కో అమల్లో ఉండగానే బతుకమ్మకుంటలో అభివృద్ధి పనులను చేపట్టడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కరణగా భావించి.. బతుకమ్మకుంటలో హైడ్రా ఏర్పాటు చేసిన పేర్లు, గుర్తులు, బోర్డులను 3 వారాల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును హైడ్రా అధికారులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తదుపరి విచారణ జరిగే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. బతుకమ్మకుంటలో బోర్డులు, శిలాఫలకాలను తొలగించేందుకు హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న బోర్డులు, ప్రారంభోత్సవ శిలాఫలకాలను తొలగించారు. ఈ బతుకమ్మకుంట వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉండగా.. తీర్పు వెలువడి ఆ స్థలం ఎవరికి చెందుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.