కర్కోటకుడు, హిట్లర్.. కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ తీవ్ర వ్యాఖ్యలు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై.. ప్రభుత్వ విప్, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడిన ఆది శ్రీనివాస్.. కేసీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ముందు గత 10 ఏళ్ల పాలన అత్యంత నియంతృత్వంగా సాగిందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిట్లర్ తరహాలో వ్యవహరించారని.. ఆయన ఒక కర్కోటకుడు అంటూ సంచలన ఆరోపణలకు తెర తీశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆది శ్రీనివాస్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అవినీతిపై కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పులను ఆయన సొంత కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారని ఆరోపించారు. సారు రారు.. కారు రాదు అంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆది శ్రీనివాస్.. ఆ మాటలకు కేసీఆర్ వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ సభపైనా ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నందుకు.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు వరంగల్ సభ పెట్టుకోవాలని హితవు పలికారు.అదే సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తోందని ఆది శ్రీనివాస్ తేల్చి చెప్పారు. వరంగల్‌లో రైతు సభ పెట్టడానికి బీఆర్ఎస్‌ పార్టీకి ఏం హక్కు ఉందని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నర ఏళ్లుగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 28 నెలల్లోనే రాష్ట్రంలోని అన్నదాతల కోసం రూ. 1,52,656 కోట్లు ఖర్చు చేసినట్లు ఆది శ్రీనివాస్ లెక్కలతో సహా వివరించారు. ఇక అదే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేవలం రూ. 2,88,670 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో రైతులకు నెలకు సగటున రూ. 2532 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో రూ.5452 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వివరించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హయాంలో.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అప్పుల కారణంగా ఛిన్నాభిన్నమైపోయిందని.. తాము రైతు భరోసా నిధులను సకాలంలో జమ చేస్తున్నామని చెప్పారు.అదే సమయంలో తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని.. మొత్తంగా 8525 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 6005 ప్రారంభమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 7.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రూ. 277 కోట్లను అన్నదాతల అకౌంట్లలో వేసినట్లు చెప్పుకొచ్చారు. తాలు పేరుతో గతంలో కిలోల కొద్దీ ధాన్యాన్ని కట్ చేసేవారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లోనే ఇప్పుడు డబ్బులు జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 25 లక్షల మందికి పైగా రైతులకు ఒకేసారి రూ. 20,616 కోట్ల రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు.ఇక వరి సాగులో పంజాబ్‌ను దాటి.. తెలంగాణ రికార్డు సృష్టించిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. వానాకాలంలో 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు చెప్పారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రతీ సంవత్సరం రూ. 10,444 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు.