జొమాటోకు ఏకంగా 346 శాతం పెరిగిన లాభం.. 17 వేల కోట్ల ఆదాయం.. ఆఖర్లో 'స్టాక్' మ్యాజిక్!

Wait 5 sec.

Price: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, క్విక్ కామర్స్ వ్యాపారం నిర్వహిస్తున్న బ్లింకిట్ పేరెంట్ కంపెనీ.. ఎటర్నల్ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి) ఫలితాల్ని వెల్లడించింది. మంగళవారం స్టాక్ మార్కెట్ సెషన్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందే విడుదల చేసింది. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఫలితాల్లో అదరగొట్టింది. సంస్థ నికర లాభం రూ. 174 కోట్లు వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే లాభం ఏకంగా 346 రెట్లు పెరిగింది. అంటే దాదాపు నాలుగింతల మేర లాభం పెరిగిందన్నమాట. ఏడాది కిందట ఇదే సమయంలో లాభం కేవలం రూ. 39 కోట్లుగానే ఉండేది. ఇక కిందటి త్రైమాసికంలో (అక్టోబర్- డిసెంబరు) లాభం రూ. 102 కోట్లుగా ఉంది. క్యూ3 తో పోల్చినా లాభం భారీగానే పెరిగింది.కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఎటర్నల్ కార్యకలాపాల ఆదాయం సమీక్షా త్రైమాసికంలో రూ. 17,292 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆదాయం కేవలం రూ. 5,833 కోట్లుగా ఉండగా.. అప్పటితో పోలిస్తే 196 శాతం ఎగబాకింది. ఆదాయం.. మూడో త్రైమాసికంలో చూస్తే రూ. 16,315 కోట్లుగా ఉంది. ఇక్కడితో చూసినా ఆదాయం పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ లాభం రూ. 366 కోట్లుగా వచ్చింది. ఇది అంతకుముందుతో పోలిస్తే 31 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆదాయం 169 శాతం పెరిగి రూ. 54,364 కోట్లకు చేరుకుంది. జొమాటో నెట్ ఆర్డర్ వాల్యూ (NOV) వార్షిక ప్రాతిపదికన 18.8 శాతం పెరిగింది. బ్లింకిట్ నెట్ ఆర్డర్ వాల్యూ ఏకంగా 95.4 శాతం పెరగడం విశేషం. సమీక్షా త్రైమాసికంలో బ్లింకిట్ కొత్తగా 216 స్టోర్లను తెరవగా.. మొత్తం స్టోర్ల సంఖ్య 2,243 కు చేరింది. టికెటింగ్ ప్లాట్‌ఫారం డిస్ట్రిక్ట్ ఆదాయం 46 శాతానికిపైగా పెరిగింది. నష్టాలు కూడా తగ్గాయి. భారీ నష్టం నుంచి కోలుకున్న షేరు..ఇక ఫలితాల ముందు వరకు మంగళవారం సెషన్‌లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో.. జొమాటో (ఎటర్నల్) షేరు ఒక దశలో 4 శాతానికిపైగా పడిపోయింది. కిందటి సెషన్‌లో రూ. 255.49 వద్ద ముగియగా ఇవాళ (ఏప్రిల్ 28) రూ. 256 వద్ద ఓపెన్ అయింది. ఇంట్రాడేలో 4 శాతానికిపైగా తగ్గి రూ. 245 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫలితాలు రాగా.. అప్పటివరకూ 4 శాతం వరకు నష్టాల్లోనే ఉండగా.. ఒక్కసారిగా నష్టాల్ని పూడ్చుకొని చివరకు లాభాలు నమోదు చేయడం విశేషం. ఇంట్రాడేలో దాదాపు 2 శాతం వరకు లాభంతో రూ. 260.50 వద్ద గరిష్ఠాన్ని తాకగా.. చివరకు 1.09 శాతం పెరిగి రూ. 258.28 వద్ద సెషన్ ముగించింది. ఇంట్రాడే లో నుంచి చూస్తే దాదాపు 5 శాతానికిపైగా పెరిగింది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 2.30 లక్షల కోట్లుగా ఉంది.