ఆంధ్రప్రదేశ్‌లో నెలకున్న ఇంధన కొరత, రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞ‌ప్తిపై కేంద్రం స్పందించింది. రిటైల్ ఔట్‌లెట్ల నుంచి బల్క్‌గా సరఫరా చేయడం నిబంధనలకు విరుద్దమని పేర్కొంది. నేరుగా ఆయిల్ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రిటైల్ బంకుల ద్వారా డీజిల్ సరఫరాకు ససేమిరా అంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జారీచేసి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. రాజధాని పనుల కోసం కూటమి ప్రభుత్వం డీజిల్ కోరడంతో మోదీ సర్కారు ఈ మేరకు స్పందించింది.నాలుగు రోజుల కిందట ఆయిల్‌ కంపెనీలకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ప్రభుత్వం.. రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం బల్క్‌గా డీజిల్‌ను రిటైల్‌ బంకుల నుంచి సరఫరా చేయాలని సూచించింది. మొత్తం 2,75,66,000 లీటర్ల డీజిల్‌ను సరఫరా చేయాలని కోరింది. అయితే, ఈ ఆదేశాలను కేంద్రం తప్పుబట్టింది.రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల వాహనదారులు బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో పడిగాపులు కాస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మంగళవారం మరోసారి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సరఫరా సాధారణ స్థితికి చేరుకునే వరకు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. చమురు సంస్థల నుంచి బంకులకు లోడ్‌ డిస్పాచెస్‌ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా తీశారు. బంకులకు నిరంతరం పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా జరిగేలా చూస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. క్యూలైన్లు లేకుండా చూడాలని, అవసరమైతే టోకెన్‌ సిస్టమ్‌ పెట్టుకోవాలని సీఎం సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ను దారి మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.