ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతలో రాష్ట్రంపై ద్రోణి ప్రభావం కనిపిస్తోంది.. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో వేడిగాలులు, 7 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని 140 మండలాల్లో తీవ్రమైన ఎండ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు వేడిగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఏపీలోని 16 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కంభం, కడప జిల్లా ఒంటిమిట్టలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంపై ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మార్కాపురం జిల్లాలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల దెబ్బకు చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. గిద్దలూరులో దాదాపు గంటసేపు వర్షం పడింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు, స్తంభాలు నెలకొరగడంతో ఆయా ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఏపీలో ఆయిల్ అండ్ కెమికల్ డిజాస్టర్‌పై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తామన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. మే మొదటి వారంలో 15 జిల్లాల్లోని 22 కీలక పరిశ్రమల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు. ప్రమాద సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడం, ఆయా విభాగాల మధ్య సమన్వయాన్ని, సామర్ధ్యాలని పెంచడమే లక్ష్యమన్నారు. సన్నద్ధతలో భాగంగా 15 జిల్లాల కలెక్టర్లు, రెస్క్యూ బృందాలతో టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్ పూర్తి చేశామన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు ఈ డ్రిల్ ఎంతో కీలకం అన్నారు.ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌ జాతీయ, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రధానంగా మాక్ ఎక్సర్‌సైజ్‌ ద్వారా ప్రాణ-ఆస్తి నష్టం తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామన్నారు. ఈ మాక్ డ్రిల్‌ను రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య, విద్య శాఖల భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తామన్నారు. అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు అగ్నిమాపక సిబ్బంది కూడా పాల్గొంటారు. ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌ను విశాఖపట్నంలో ఎన్డీఎంఏ కమాండెంట్ పర్యవేక్షణ చేస్తారన్నారు.