దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.500 రాహు కేతు సర్పదోష నివారణ పూజను రద్దు చేయాలనే నిర్ణయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఉపసంహరించుకుంది. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత, తిరుపతి జిల్లాలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయం శ్రీకాళహస్తి ఆలయం. ఈ ఆలయానికి ఏడాది పొడవునా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించే రాహు కేతు పూజలు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కాలసర్ప దోషాన్ని తగ్గించుకునేందుకు ఈ పూజలు నిర్వహిస్తారు. .. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు, రాహు కేజు పూజల టికెట్లు రూ.500 నుంచి రూ.5000 వరకూ ఉంటాయి. శ్రీకాళహస్తి ఆలయానికి రాహు కేతు పూజ టిక్కెట్ల అమ్మకం ద్వారానే ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఏటా సగటున 10 లక్షల మంది భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజను నిర్వహిస్తారని అంచనా. అయితే ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రాహు కేతు పూజల ప్రారంభ టికెట్ ధరను రూ.500 నుంచి రూ.750కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే భక్తుల కోసం సామూహిక రాహు కేతు పూజను ప్రవేశపెట్టాలని తీర్మానించారు.సామూహిక రాహు కేతు పూజలలో భక్తులు పాల్గొనేందుకు వీలుంటుందని కానీ.. నాగేంద్రుల వెండి ప్రతిమలను ఉపయోగించరు. అలాగే రూ.5 వేలు ఉన్న రాహు కేతు పూజను రూ.6000 చేయాలని నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో వెండి ధరలు పెరగడంతో శ్రీకాళహస్తి దేవస్థానం ఈ నిర్ణయాలు తీసుకుంది. అయితే శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి నిర్ణయాలపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాలను తప్పుబట్టారు. భక్తుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానం తన నిర్ణయాలను ఉపసంహరించుకుని, రాహు కేతు పూజా రుసుమును పెంచకూడదని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు తన నిర్ణయాన్ని సమీక్షించిందని, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు శ్రీకాళహస్తి దేవాలయం ఈవో వెంకటేశులు తెలిపారు.