Gold Purchase: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఏడాది కాలంలోనే ఊహించని విధంగా పెరిగాయి. ఈ క్రమంలో భారతీయులు బంగారం కొనుగోలు చేసే దృక్పథం మార్చుకుంటున్నారని ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో గత ఏడాది 2025లో బంగారాన్ని పెట్టుబడుల కోసం కొనుగోలు చేయడం 40 శాతానికి ఎగబాకినట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాది వరకు అది 30 శాతానికి లోపే ఉండాదని, చేసే వారని పేర్కొంది. అయితే, ధరలు పెరుగుతుండడం వంటి కారణాలతో నగలకు బదులుగా ఆస్తులకు ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొంది. మరి ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. గత ఏడాదిలో పెట్టుబడుల కోసం మేలిమి బంగారం కొనుగోళ్లు, డిజిటల్ విధానంలో కొనుగోళ్లు అనేవి ఎక్కువగా జరిగాయని కేర్ ఎడ్జ్ నివేదిక పేర్కొంది. బంగారం ఈటీఎఫ్‌ల ద్వారానే ఏకంగా 37.5 టన్నుల బంగారానికి సమానమైన పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది. గత 10 సంవత్సరాల కాలంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువగా ఉండడం గమనార్హం. 2026-27 ఆర్థిక సంవత్సరం లోనూ మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడుల విలువ 35-40 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది. 2026లోనూ బంగారం ధరలు గరిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతాయని కేర్ ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ అంచనా వేశారు. గత ఏడాది 2025లో నగల గిరాకీ, విలువ పరంగా వార్షికంగా 10 శాతం మేర పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తేలికైన, తక్కువ క్యారెట్ల ఆభరణాలకు మొగ్గు చూపుతున్నారని, అలాగే ఈ లోహాల అమ్మకాల పరిమాణ 15 శాతం మేర పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది. 2025-26 ఆర్థిక ఏడాదిలో ఆభరణాల పెద్ద వ్యాపారులు 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో అది 20-25 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసిందిని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. 2025లో బంగారం పెట్టుబడుల డిమాండ్ 2175 మెట్రిక్ టన్నులకు చేరిందని, అది అంతకు ముందు 2020లోని 1805 టన్నులను మించినట్లు తెలిపింది. ఇందులో ఎక్స్ఛేంచ్ ట్రేడెడ్ ఫండ్స్‌ వాటానే ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే బంగారు కడ్డీలు, నాణెల కొనుగోలు సైతం పెరిగిందని, అది 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపింది. భారత్‌లోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2025 ఒక్క ఏడాదిలోనే 37.5 టన్నులకు సరిపడా పెట్టుబడులు వచ్చాని పేర్కొంది.