నిమిషాల్లోనే ఇంటికి సరకులు.. హైదరాబాద్, వైజాగ్‌లోనూ అమెజాన్ నౌ.. రూ.2800 కోట్ల పెట్టుబడులు

Wait 5 sec.

Amazon Now: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ క్విక్ కామర్స్ విభాగం విస్తరణకు సిద్ధమైంది. తమ అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సర్వీసులను భారత్‌లో 100 నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది. వినియోగదారులకు ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సరకులను ఇంటికి చేర్చే సేవలను అమెజాన్ నౌ అందిస్తోంది. ఇప్పుడు ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈ భారీ విస్తరణకు అనుగుణంగా తమ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని, తమ సేవలను హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వంద నగరాలకు క్విక్-కామర్స్ సేవలను విస్తరించే లక్ష్యంగా భాగంగా 1000కి పైగా మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను హైదరాబాద్, విశాఖపట్నం, పుణె, చెన్నై, కోల్‌కతా, లఖ్‌నవూ, కాన్పూర్, ఛండీగఢ్, అహ్మదాబాద్, మీరట్, మైసూర్, పానిపట్, కొచ్చి, అమృత్‌సర్, మంగళూరు వంటి ఇతర నగరాలకూ విస్తరిస్తామని తెలిపింది. తాజా పండ్లు, కూరగాయలు, కిరాణా సరకుల వంటి తదితర ఉత్పత్తులతో పాటు, గృహోపకరణాలు, పిల్లల వస్తువుల వంటివీ ఇకపై నిమిషాల వ్యవధిలోనే తమ యూజర్లకు చేరుస్తామని పేర్కొంది. 'మా డెలివరీ వేగం, విలువ, సెలక్షన్, ముఖ్యంగా రైతుల నుంచి నేరుగా సేకరించిన తాజా ఉత్పత్తుల నాణ్యతను మెచ్చుకుంటూ వినియోగదారులు అమెజాన్ నౌను ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఈ విజయంతో ప్రోత్సాహం పొంది మేము మా విస్తరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేశాం. 1,000 కంటే ఎక్కువ మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల నెట్‌వర్క్‌తో అమెజాన్ నౌను 100 నగరాలకు విస్తరిస్తాం' అని అమెజాన్ ఇండియా, ఎవ్రీడే ఎసెన్షియల్స్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ గోయల్ అన్నారు. విస్తరణ ద్వారా దేశవ్యాప్తంగా 16 వేల మందికిపైగా రైతులు మా టెక్నాలజీ, ఆపరేషన్స్ ఉపయోగించుకుని తాజా ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు చేరవేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వేలాది నిత్యావసర వస్తువులను చాలా వేగంగా డెలివరీ పొందడమే కాకుండా తమకు నచ్చిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇవి అత్యంత వేగవంతమైన డెలివరీల కోసం రూపొందించిన చిన్న, టెక్నాలజీతో కూడిన కేంద్రాలు. ఈ సెంటర్లు, స్థానిక డిమాండ్‌ను బట్టి ఉత్పత్తులను సరైన స్థానంలో ఉంచే అధునాతన ఇన్వెంటరీ వ్యవస్థలను ఉపయోగించి, వినియోగదారుల నివాస ప్రాంతాలకు సమీపంలో నిత్యావసర ఉత్పత్తులను ఉంచుతాయి.