తెలుగు జాతికి ప్రతీకగా నిలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విశ్వకళా పరిషత్) చరిత్ర ఓ అద్భుతం, అజరామరం. ఎంతోమంది మేధావుల్ని, ప్రముఖుల్ని దేశానికి కానుకగా ఇచ్చిన ఈ చదువుల తల్లి కొలువైన నిలయం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారతదేశ చరిత్రలో అత్యంత పురాతనమైన ఆంధ్ర విశ్యవిద్యాలయం ఏకంగా వందేళ్లు పండగను ఘనంగా జరుపుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్ల మైలురాయిని చేరుకున్న వేళ.. శతాబ్ది వేడుకల జరుపుకుంటున్న సమయాన ఆ జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుందాం..మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి ఉన్నత చదువుల కోసం ఓ విశ్వవిద్యాలయం ఉండాలనే బలమైన ఆకాంక్ష 1914లోనే మొదలైంది. బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఈ డిమాండ్ తొలిసారి తెరపైకి వచ్చింది. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత 1926 ఏప్రిల్ 26న (మద్రాస్ యాక్ట్ 1925 ) ఎంతోమంది మహానుభావుల కృషితో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. ముందు ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించారు. ఈ వర్శిటీకి 1926 నుంచి 1931 వరకు కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత 1930లో విశాఖపట్నంలోని వాల్తేరుకు తరలించారు. 1931లో ఆంధ్ర యూనివర్శిటీకి భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. మళ్ల రెండోసారి కట్టమంచి రామలింగారెడ్డి 1936 నుంచి 1949 వరకు వైస్ ఛాన్సలర్‌‌గా వ్యవహరించారు. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్‌కు ఆంధ్ర యూనివర్శిటీ ఫిజిక్స్ విభాగంలో పరిశోధనలతో సన్నిహిత సంబంధం ఉంది.ఆంధ్ర విశ్వవిద్యాలయం దాదాపు 422 ఎకరాల్లో ఉంది.. మొత్తం ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా ఇలా 58 డిపార్ట్‌మెంట్‌లు, 16 పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి. 1931 జులై 1న 'యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్'.. ఆ తర్వత ఏడాదే సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారి 1934 నుంచి కామర్స్‌లో ఆనర్స్ డిగ్రీ మొదలుపెట్టారు. 1957లో దేశంలోనే మొట్టమొదటిసారి ఎంబీఏ ప్రవేశపెట్టారు. మెరైన్ ఇంజనీరింగ్, Nuclear Physics (అణు భౌతిక శాస్త్రం), వాతావరణ శాస్త్రాలలో దేశంలోనే మొదటిసారిగా కోర్సులను ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్ర యూనివర్శిటీకి దక్కుతుంది. 2023లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నాక్ (NAAC) సంస్థ ఇచ్చిన "ఏ" గ్రేడును దక్కించుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని భవనాల నిర్మాణం యుద్ధ నౌకను పోలిన ఆకారంలో ఉంటాయని చెబుతారు. ఇలా డిజైన్ ప్లాన్ చేయడం వెనుక ఓ కారణం కూడా ఉందంటారు. ఆంధ్ర యూనివర్శిటీ భవనాల నిర్మాణం జరుగుతున్న సమయంలోనే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందట. ఆ సమయంలో విశాఖపట్నంపై దాడులు జరిగే ప్రమాదం ఉందని భావించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఈ భవనాలను సైనిక అవసరాల కోసం ఉపయోగించుకునేలా వీలుగా నిర్మించారని చెబుతుంటారు. బాంబు దాడులు జరిగినా తట్టుకునేలా, శత్రువులు చూసినప్పుడు కాస్త గందరగోళం అనిపించేలా ఈ భవనాలు డిజైన్ చేశారని చెబుతుంటారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం దత్తర (నార్త్), దక్షిణ (సౌత్) క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. అనంతరం ఆంధ్ర యూనివర్శిటీకి సంబంధించి పీజీల కోసం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ యూనివర్శిటీ ఏర్పాటు చేయడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని కాలేజీలు నన్నయ వర్శిటీ పరిధిలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలలోని కాలేజీలు ఉన్నాయి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్శిటీలో చదువుకుని దేశంలో అత్యున్నత పదవులను అధిరోహించినన వారు ఉన్నారు. లాయర్లు, ఇంజినీర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, రాజకీయ నేతలుగా, రాజ్యాంగబద్ధ పదవుల్లో, న్యాయమూర్తులుగా.. DRDO, ISRO, వ్యాపార రంగం, సినిమా రంగం, క్రీడారంగంలో రాణిస్తున్నవారు ఇక్కడ చదువుకుని వెళ్లినవారే. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్శిటీ వందేళ్ల వైభవానికి గుర్తుగా కేంద్రం ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. ఏయూ శతాబ్ధి ఉత్సవాలకు గుర్తుగా ప్రత్యేకంగా రూ. 100 నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో ఆంధ్ర యూనివర్శిటీని టప్ 100 యూనివర్శిటీల్లో స్థానం సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారు. కేంద్రం మిషన్ మౌసమ్ ప్రాజెక్ట్ కింద ట్రాపికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏయూ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.