హైదరాబాద్‌లో హిమాలయాల సీన్.. మంచుతో నిండిన రోడ్లు, ఏం ఫీల్ ఉంది మావా..!

Wait 5 sec.

హిమాలయాల్లో ఉండే మంచు హైదరాబాద్ నగర రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుంది.. ఆ మంచులో సరదాగా చిల్ అయితే..? ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందని అనుకుంటున్నారా..? సోమవారం (ఏప్రిల్ 27) సాయంత్రం ఆ ఊహ నిజమైంది. పలువురు నగరవాసులు మంచులో ఆడుకుంటూ చిల్ అయ్యారు. హైదరాబాద్ నగర శివార్లలో నిన్న సాయంత్రం భారీ వడగళ్ల వాన కురిసింది. ముఖ్యంగా శంషాబాద్ - నాదర్‌గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డుపై వడగళ్లు మంచులా పేరుకుపోయాయి. చూడ్డానికి ఆ రోడ్లు అచ్చంగా కశ్మీర్, యూరప్‌‌లను తలపించింది. రోడ్డంతా తెల్లని మంచు ముక్కలతో నిండిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఫోటోలు, రీల్స్ తీస్తూ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.నగరంలోని ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. అయితే, ఈ వర్షం సాధారణం కంటే భిన్నంగా శివారు ప్రాంతాల్లో మంచు తుపానును తలపించేలా కురిసింది. ముఖ్యంగా శంషాబాద్ నాదర్‌గుల్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. కుండపోతగా పడిన వడగళ్ల కారణంగా రోడ్డంతా తెల్లని మంచు ముక్కలతో నిండిపోయింది. కొద్ది నిమిషాల్లోనే రోడ్డుపై అంగుళాల మేర మంచు పేరుకుపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. నిత్యం వాహనాలతో బిజీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు, ఒక్కసారిగా హిమాలయ పర్వత శ్రేణుల్లా, కశ్మీర్‌లోని మంచు వీధుల్లా మారిపోయింది. రోడ్డుకు ఇరువైపులా పరుచుకున్న తెల్లని వడగళ్లు యూరప్ దేశాల్లోని శీతాకాల వాతావరణాన్ని తలపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డుపై ఆగి మరీ మంచుతో ఆడుకుంటూ కనిపించారు. చాలా మంది యువకులు ఈ మంచు కుప్పల వద్ద ఫోటోలు దిగుతూ.. రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. సాధారణంగా ఏప్రిల్ నెలలో ఎండలతో ఇబ్బంది పడే నగరవాసులకు.. సోమవారం కురిసిన వాన ఊరటనిచ్చింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. 'హైదరాబాద్ హిమాలయాలు' అనే ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లు ఈ దృశ్యాలను చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. 'హైదరాబాద్ కశ్మీర్ అయిపోయింది' అని కొందరు.. 'యూరప్ వెళ్లాల్సిన అవసరం లేదు.. మన ఓఆర్ఆర్‌కి వెళ్తే సరిపోతుంది.. ఏం ఫీల్ ఉంది మావా...' అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే రోడ్డుపై మంచు వల్ల వాహనాలు జారిపోయే ప్రమాదం ఉండటంతో పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు. నేడూ వడగళ్ల వానలు.. ఇక సోమవారం మాదిరిగానే ఉత్తర, మధ్య తెలంగాణలో వడగాలులు కొనసాగనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం అక్కడక్కడా వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.