1000 బస్సులకు ఓనర్లుగా మహిళలు.. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎం రేవంత్

Wait 5 sec.

తెలంగాణలో మహిళలు, పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా మహిళల తక్షణ రక్షణ కోసం ఉద్దేశించిన 'స్పందన' ప్రత్యేక వాహనాలను సోమవారం (ఏప్రిల్ 27) ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసులు, పీస్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళా రక్షణ కోసం చేపడుతున్న వినూత్న చర్యలను వివరించారు. 'మహిళ తన కాళ్ల మీద తాను నిలబడాలంటే వారికి తగిన రక్షణ కల్పించాలి. వారి పిల్లలకు భద్రత ఉండాలి. మహిళ చదువు, వ్యాపారాన్ని స్వేచ్ఛగా నిర్వహించినప్పుడే సమాజం ప్రగతి సాధిస్తుంది. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలను పూర్తిగా నిరోధించి వారికి తగిన రక్షణ కల్పించే విషయంలో స్వచ్ఛంధ సంస్థలు, పీస్ కమిటీలు కూడా సామాజిక బాధ్యతగా పనిచేయాలని కోరారు. మహిళల పట్ల దురుసుగా, అవహేళనగా ప్రవర్తించిన వారిని శిక్షించడానికి షీ టీమ్స్ ఏర్పాటు చేయగా.. సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళకు అండగా నిలవాలన్న లక్ష్యంతో StandWithHer అన్న కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మరో అడుగు ముందుకేసి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పనిచేసే స్పందన టీమ్‌లను ఏర్పాటు చేశారు.ఈ టీమ్‌లు బాధితుల వద్దకు వెళ్లి ముందు వారికొక మానసిక ధైర్యాన్ని కల్పిస్తాయి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. మహిళ తన గౌరవాన్ని కాపాడటంలో ఈ ప్రభుత్వం, ఈ సమాజం పక్కన నిలబడుతుందన్న నమ్మకం, విశ్వాసం వారిలో కల్పించాలి. మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం కన్నా సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పౌర సమాజంపైన కూడా ఉంది. పీస్ కమిటీల సామాజిక బాధ్యతలను విస్తరించాలి. అసాంఘిక చర్యలను నియంత్రించడంలో వారిని భాగస్వామ్యం చేయాలి. కమిటీ సభ్యులు వారి ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చేరవేయాలి.ఇక రాష్ట్రం, దేశం ప్రగతిపథంలో నడుస్తుంది. 2034 నాటికి రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుతో మంజూరు చేయడం, 67 లక్షల మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘాలకు 60 వేల కోట్ల బ్యాంకు లోన్ లింకేజీ కల్పించడం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, వెయ్యి బస్సులకు యజమానులుగా చేయడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు నిర్వహించేలా ప్రోత్సహించాం.' అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మహిళా సంఘాలకు అప్పగించడం, ఈ స్కూళ్లలో విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం, మహిళా సంఘాల వస్తువుల మార్కెట్ కోసం హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాల విలువైన స్థలం ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ కోసం అప్పగించడం వంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.