ఏపీఎస్‌ఆర్టీసీకి కొత్తగా మరో 1,450 విద్యుత్‌ బస్సులు.. తీరనున్న ప్రయాణికుల కష్టాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా రవాణాపై ఫోకస్ పెట్టింది. కేంద్రం ఇప్పటికే 1050 విద్యుత్ బస్సులు ఏపీకి కేటాయించగా.. తాజాగా మరికొన్ని బస్సుల్ని తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్‌ఆర్టీసీ మరో 1450 బస్సుల్ని సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకోగా.. ప్రభుత్వం ఓకే చెప్పింది. Sustainable Electric Vehicle Policy (సుస్థిర విద్యుత్‌ వాహన పాలసీ) 4.O కింద ఆర్టీసీలో మార్పులకు సిద్ధమయ్యారు. ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న 8,375 డీజిల్‌ బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సుల్ని 2031 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు తగిన విధంగా 1450 బస్సుల్ని తీసుకోవాలని నిర్ణయించారు. ఏపీకి ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవా పథకం కింద 1,050 బస్సులను కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. .. తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో 300 బస్సులు ఉన్నాయి. కేంద్రం ఈ బస్సులకు సంబంధించి టెండర్లను పిలిచింది.. పినాకిల్ సంస్థ బస్సుల్ని సరఫరా చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేటాయించిన 1,050 బస్సులకు తోడు కొత్తగా తీసుకోనున్న 1,450 బస్సులు తీసుకోనున్నారు. త్వరలోనే ఈ కొత్త బస్సుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీనే టెండర్లు పిలవనుంది. ఈ బస్సుల్ని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్టీసీ 8.5 అడుగులు వెడల్పు బస్సులు తీసుకోనుంది.. అప్పుడు ఎక్కువ సీట్లు అమర్చేందుకు వీలుంటుందని చెబుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ముందు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ముందుగా 20 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్లాన్ చేస్తోంది. జూన్, జులై నెలల్లో విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో.. అప్పటి నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ మధ్య విద్యుత్‌ బస్సుల్ని షటిల్‌ సర్వీసుల కింద అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీలో కేవలం విద్యుత్ బస్సులు మాత్రమే కాదు సీఎన్‌జీ బస్సుల్ని కూడా తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. 15 ఏళ్లు దాటిన బస్సుల స్థానంలో 500 సీఎన్‌జీ బస్సుల్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. 500 డీజిల్ బస్సులు ఏకంగా ఆరు నుంచి ఏడు లక్షల కిలోమీటర్లు తిరిగాయి.. ఆ బస్సుల్ని రెట్రోఫిట్‌మెంట్ చేసి సీఎన్‌జీ కిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో బస్సులు, సీఎన్‌జీ సౌకర్యం ఎలా ఉందో పరిశీలిస్తున్నారు. ఈ సీఎన్‌జీని బయట కంటే కేజీకి రూ.4 నుంచి 5 వరకు తగ్గించాలని ఆర్టీసీ కోరింది.. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం మరికొన్ని విద్యుత్ బస్సుల కొనుగోళ్లపై ఫోకస్ పెట్టింది.