: గుజరాత్‌లోని అబ్దసా గడ్డి భూముల్లోలో నెల రోజుల క్రితం ఓ అరుదైన బట్ట మేక పిట్ట పిల్ల పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ బుజ్జి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించింది. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో మొత్తంగా 50 మంది దానికోసం కాపలా కాశారు. అయితే అంత పెద్ద మొత్తంలో భద్రత కల్పిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఆ బట్టమేక పిట్ట పిల్ల అదృశ్యమైంది. ఇత మంది నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ.. ఈ అరుదైన పక్షి పిల్లను కాపాడుకోలేకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే?గత మార్చి 26వ తేదీన కచ్ ప్రాంతంలో ఈ పక్షి పిల్ల జన్మించింది. అత్యంత ప్రమాదకరంగా అంతరించిపోతున్న ఈ పక్షి జాతిలో.. కొత్తగా ఓ పిల్ల పుట్టడంతో అంతా తెగ సంబుర పడిపోయారు. ఈక్రమంలోనే దీన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ కూడా పెద్ద ఎత్తున భద్రత కల్పించింది. ముఖ్యంగా వీవీఐపీలకు కల్పించే జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఇచ్చింది. ఈ పక్షి పిల్ల రక్షణ కోసం . వీరు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ.. 24/7 పక్షికి రక్షణ కల్పించారు. అంతేకాకుండా ఈ పక్షి పిల్ల కదలికలను గమనించడానికి ప్రత్యేకంగా వాచ్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద స్థాయిలో భద్రత కల్పించినప్పటికీ ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఈ పక్షి పిల్ల కనిపించకుండా పోయింది. దీని తల్లికి జీపీఎస్ ట్యాగ్ ఉండటంతో దాని కదలికలను గుర్తించగలిగారు కానీ.. 26 రోజుల వయసున్న ఆ పక్షి పిల్ల తన తల్లి నుంచి విడిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఎంత వెతికినా దాని ఆచూకీ దొరకలేదు. నక్కలు లేదా అడవి కుక్కల వంటి క్రూర మృగాల దాడిలో అది మరణించి ఉండవచ్చని అటవీ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.అత్యంత ఖరీదైన భద్రతా వలయం ఉన్నా ఈ అఘాయిత్యం ఎలా జరిగిందనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫెన్సింగ్‌లో ఉన్న కొన్ని ఖాళీల గుండా అడవి మృగాలు లోపలికి ప్రవేశించి ఉండవచ్చని సమాచారం. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అర్జున్ మోద్వాడియా మాట్లాడుతూ.. పక్షి పిల్ల అదృశ్యంపై తనకు సమాచారం లేదని చెప్పడం గమనార్హం. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ప్రతినిధులు ఈ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. పక్షి గుడ్లు పెట్టినప్పుడే సరైన భద్రత కల్పించాల్సిందని, పక్షి పిల్ల పుట్టిన తర్వాత భారీ భద్రత ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయిందని అభిప్రాయ పడుతున్నారు.గతంలోనే ఇలాగే మగ బట్టమేక పిట్ట పిల్ల అదృశ్యంగుజరాత్‌లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వడం ఇది మొదటిసారి కాదు. 2018 డిసెంబర్‌లో రాష్ట్రంలో మిగిలి ఉన్న ఏకైక మగ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా ఇలాగే అదృశ్యమైంది. దాని జాడ ఇప్పటికీ దొరకలేదు. ఇప్పుడు ఈ అరుదైన పక్షి పిల్ల కూడా కనిపించకుండా పోవడంతో.. ఈ జాతి పక్షులు గుజరాత్ నుంచి శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో పక్కా నిఘా లేకపోతే ఈ జాతిని కాపాడటం అసాధ్యమని వారు హెచ్చరిస్తున్నారు.