దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో బుధవారం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరములు, మెరుపులు, పిడుగులతో కురిసిన ఈ వర్షం జనాలను వణికించింది. అకాల వర్షానికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోని బౌరింగ్, లేడీ కర్జాన్ ఆసుపత్రి సమీపంలో ప్రహరీ గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారుల సహా ఏడుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారం తెలియగానే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడకు చేరుకున్నారు. బౌరింగ్ ఆసుపత్రి ప్రాంగణం సమీపంలో జరిగిన గోడ కూలిన ఘోరమైన ఘటనలో ఏడుగురు మరణించినట్లు సీఎంఓ ధ్రువీకరించింది.బాధిత కుటుంబాలకు సీఎం సిద్ధూ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ప్రభుత్వం తరఫున అందజేయనున్నట్టు సీఎం తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలులు, వడగళ్ల వాన ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. ఆ సమయంలో ఏడుగురు బాధితులు గోడ దగ్గర తలదాచుకుంటుండగా అది అకస్మాత్తుగా కూలిపోయింది.పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో శిథిలాల నుంచి మృతదేహాలను గాయపడిన వారిని బయటకు తీశారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే తాను సంఘటనా స్థలానికి బయలుదేరినట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ‘‘పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాను.. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్తున్నాను. బాధితులకు వీలైనంత వరకూ సాయం చేస్తాం’’ అని ఆయన విలేకరులతో అన్నారు.బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి, జనజీవనం అస్తవ్యస్తమైంది. అత్యధికంగా కాటన్‌పేట్‌లో 77.5 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. తర్వాత చామరాజ్‌పేట్ 77.0 మి.మీ., పులకేశినగర్ 62.0 మి.మీ., విశ్వేశ్వరపురం 60.5 మి.మీ.లలో వర్షపాతం కురిసింది. నేరిగ (55.0 మి.మీ.), రాజమహల్ గుట్టహళ్లి (54.0 మి.మీ.), బీటీఎం లేఅవుట్ (47.0 మి.మీ.) సహా పలు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రద్దీ సమయాల్లో ప్రయాణికుల కష్టాలు మరింత పెరిగాయి.