కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతకొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమ్మక్క, సారలమ్మ జాతర సమయంలోనూ తాజాగా మరోసారి సీపీ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్ రెడ్డి.. కరీంనగర్ సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేట్ వ్యక్తుల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. 'కమిషనర్‌ గౌస్ ఆలం హైదరాబాద్‌లో ఒక ఇన్నోవా క్రిస్టా కారు పెట్టి జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా పెట్టాడు. ఆయన తన పవర్ మిస్ యూజ్ చేస్తున్నాడు. ఈ ఇన్నోవా కారును కమిషనర్ తన స్నేహితుడు ఐఆర్ఎస్ అధికారి అయిన వికాస్ అగర్వాల్ తండ్రి ఇంటికి పంపిస్తాడు. నార్మల్ సివిలియన్ కోసం ఒక కారు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చి ఆయన్ను రోజూ నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తారు. 8 నెలల నుంచి ఆ వాహనం డీజీపీ ఆఫీస్ దగ్గరలోని అపార్ట్‌మెంట్ వద్ద తిరిగితుంటే డీజీపీ శివధర్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లా లేనట్లా' అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. సీపీ పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని.. ఆ ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఇల్లీగల్ పనులు చేస్తున్న గౌస్ ఆలంపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీపై చర్యలు తీసుకోకపోతే 15 రోజుల్లో అన్ని వాస్తవాలు బయట పెడతానని అన్నారు. 'ఇది ట్రైలర్ మాత్రమే. ఈ గ్యాప్‌లో మీరు సర్దుకుంటే మంచిది. లేదంటే మీ లీలల వీడియోలు.. యాంటీ ఛాంబర్‌లో జరిగిన సినిమాలు.. హైదరాబాద్ రిసార్ట్‌లో జరిగిన సినిమాలు.. అన్నీ వీడియోలు, ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కటీ బయటపెడతా. ఐపీఎస్, ఐఏఎస్‌ల మీద గౌరవంతో ఇప్పటి వరకు ఆగా.. 15 రోజుల్లో చేసిన తప్పు సరిదిద్దుకోకపోతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి వీడియోలు చూపిస్తా. అక్కడ కూడా కుదరకపోతే.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వీడియోలు బయటపెడతా. ఒకరిద్దరు ఆఫీసర్ల కోసం అందరూ బద్నాం కావొద్దు.' అని కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.