రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక.. కేజీ రూ.20కే గోధుమ పిండి, తీసుకోవడం మర్చిపోవద్దు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 1 తేదీ నుంచి 15 తేదీ వరకు రేషన్ పంపిణీ చేపట్టింది. బియ్యం, పంచదార పంపిణీ చేస్తోంది.. వీటితో పాటుగా కందిపప్పు, రాగులు, జొన్నలు, గోధుమలు, పామాయిల్ కూడా పంపిణీ చేయాలని భావిస్తున్నా ఆ దిశగా అడుగులుపడటం లేదు. కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తున్నారు. అయితే జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి గోధుమ పిండిని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో కార్డుకు రాయితీపై కేజీ రూ.20 చొప్పున గోధుమ పిండి అందిస్తున్నారు. ఈ నెలలో మరికొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూడా మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఈ నెల నుంచే గోధుమ పిండి అందిస్తున్నారు. జొన్నల విషయానికి వస్తే.. గతంలో ఒక కిలో బియ్యానికి బదులు కిలో జొన్నలు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఒక్కో కార్డుదారుడికి 3 కిలోల వరకు జొన్నలు ఇస్తున్నారు. జొన్నలు తీసుకున్నవారికి మూడు కిలోలు బియ్యం తగ్గించి పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కందిపప్పును కొన్ని నెలల పాటూ పంపిణీ చేశారు. అయితే ఆ తర్వాత నుంచి కందిపప్పు సరఫరా ఆగిపోయింది.. తూకాల్లో తేడా వచ్చిందని కందిపప్పు పంపిణీని నిలిపివేశారు. ఆ తర్వాత కొన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేశారు.. కానీ పూర్తిస్థాయిలో ఎక్కడా కందిపప్పు పంపిణీ జరగలేదు. బయట మార్కెట్‌లో కందిపప్పు ధరలు కేజీ రూ.100కుపైగానే పలుకుతున్నాయి. అదే పౌరసరఫరాలశాఖ అందించే కందిపప్పు మాత్రం కేజీ రూ.67 వరకు ఉంటుంది. అయితే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచే కందిపప్పు సరఫరా లేకపోవడంతో పంపిణీ జరగడం లేదు. ప్రతి నెలా కందిపప్పు కోసం రేషన్‌కార్డులు ఉన్నవారు ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో కూడా కందిపప్పు రేషన్ షాపుల్లో అందుబాటులోకి రాలేదు.. రేషన్‌ కార్డులు ఉన్నవారికి ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఏపీ ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ రేషన్‌కార్డుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రేషన్ పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కార్డుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకు రేషన్‌‌ను పంపిణీ చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 65 ఏళ్ల వయసుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డీలర్ల ద్వారా ఇంటి దగ్గరకు ఈ సరకులు పంపిణీ చేస్తున్నారు.. మిగిలిని వారు రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిందే.