Latest Gold Silver Rates: ఇటీవల ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడులు.. మళ్లీ ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గడం గమనార్హం. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ మార్చి 4న 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2650 తగ్గగా తులం రూ. 1,54,650 వద్ద ఉంది. . మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర మార్చి 4న ఉదయం 7 గంటల సమయంలో.. రూ. 2890 తగ్గగా 10 గ్రాములకు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,67,620 వద్ద ట్రేడవుతోంది. కిందటి రోజు ఇది రూ. 2580 మేర పతనమైంది. బంగారం ధర భారీగా తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం దేశీయంగా స్థిరంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 3.15 లక్షల వద్ద ఉంది. మార్చి 2న సిల్వర్ రేటు రూ. 10 వేల మేర తగ్గుముఖం పట్టింది. దీనికి ముందటి వారం రూ. 35 వేల పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో భారీ పతనంఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు మార్చి 3 సాయంత్రం నుంచి మార్చి 4 ఉదయం వరకు చూస్తే భారీ స్థాయిలో పతనం కావడం విశేషం. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 5,150 డాలర్ల స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది 5,400 డాలర్ల మార్కు దాటి ట్రేడవడం గమనార్హం. అక్కడి నుంచి ఇంట్రాడేలో ఒక దశలో 5030 డాలర్ల స్థాయికి కూడా చేరింది. ప్రస్తుతం 5150 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇక వెండి ధర ఏకంగా 95 డాలర్ల స్థాయి నుంచి 15 శాతానికిపైగా పతనంతో 80 డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం 83 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర పతనానికి కారణాలివే..అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరలకు అనుగుణంగా దేశీయంగా మార్చి 4న ఉదయం 10 గంటలకు పసిడి, వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఒకవైపు యుద్ధభయాలు నెలకొన్నా బంగారం ధర భారీగా తగ్గేందుకు ప్రధాన కారణం యూఎస్ డాలర్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ ఇండెక్స్ మరింత బలపడి ఒక నెల గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. డాలర్ విలువ పెరిగితే.. డాలర్ రూపేణా బంగారం, వెండి కొనుగోలు చేయడం విదేశీయులకు భారమవుతుంది. ఇంకా యుద్ధం వల్ల ముడి చమురు ధరల భారీ పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తుల్లో వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని తెలుస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో ఉంటే డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగి బంగారం ఆకర్షణ కోల్పోతుంది. అప్పుడు విలువైన ఈ లోహాల్లోకి పెట్టుబడులు తగ్గుతాయి. ఇప్పుడదే జరుగుతోంది. ఈ కారణంగానే బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి.