ఏపీలో నాలుగుచోట్ల రైల్వే మెగా టెర్మినల్స్‌.. రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేలా ప్లాన్

Wait 5 sec.

ఏపీకి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది.. రాష్ట్రంలో నాలుగుచోట్ల కొత్తగా రైల్వే మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఈ టెర్మినల్స్‌ను నిర్మించడంతో పాటుగా నిర్వహణ బాధ్యతను రైల్వేశాఖ తీసుకుంటుంది.. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున టెర్మినల్స్ కోసం భూమిని మాత్రం కేటాయించాల్సి ఉంటుంది. విశాఖపట్నం, అమరావతి, గన్నవరం, తిరుపతి మెగా టెర్మినల్స్‌ ప్లాన్ చేశారు.. ఈ మేరకు భూమిని కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఈ నాలుగు టెర్మినల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపుల కోసం కసరత్తు జరుగుతోంది. రైలు బయల్దేరే స్టేషన్, చేరుకునే స్టేషన్ ఒకటే అయితే అక్కడ ఈ మెగా టెర్మినల్స్ నిర్మిస్తారు. అక్కడ రైళ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేస్తుంటారు.విశాఖపట్నంలో రైల్వే మెగా టెర్మినల్ ప్లాన్ చేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు టెర్మినల్ నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. సబ్బవరం మండలం జగన్నాథపురం దగ్గర మెగా టెర్మినల్‌ నిర్మించాలని భావిస్తున్నారు. విశాఖపట్నం దగ్గర నిర్మించేందుకు అవసరమైన స్థలం లేకపోవడంతో జగన్నాథపురం వైపు మొగ్గు చూపారు. రైల్వేశాఖ కొత్తవలస నుంచి అనకాపల్లికి కొత్తగా బైపాస్‌ డబుల్‌ లైన్‌ ప్రతిపాదించింది. ప్రస్తుతం గూడ్సు రైళ్లు విశాఖపట్నం స్టేషన్‌కు రావడం లేదు.. సింహాచలం, దువ్వాడ మీదుగా విజయవాడవైపు వెళుతున్నాయి. అయితే గూడ్సు రైళ్లు ఇకపై సింహాచలం, దువ్వాడ కూడా రాకుండా కొత్తవలస నుంచి నేరుగా అనకాపల్లి వెళ్లేందుకు కొత్తగా బైపాస్ డబుల్ లైన్ ప్రతిపాదించారు. ఈ లైన్‌లోనే జగన్నాథపురం దగ్గర మెగా టెర్మినల్‌ ప్లాన్ చేస్తున్నారు.. 500 ఎకరాలు కావాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం మాత్రమే కాదు దగ్గర కూడా ఈ మెగా కోచింగ్ టెర్మినల్స్ ప్లాన్ చేస్తున్నారు. అమరావతికి కొత్తగా ఎర్రుపాలెం-నంబూరు కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ రైల్వే లైన్‌లోనే అమరావతి మెగా టెర్మినల్‌కు 300 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని రైల్వేశాఖ కోరింది. ఇక గన్నవరం దగ్గర కూడా మరో టెర్మినల్ ప్లాన్ చేస్తుండగా.. 145 ఎకరాలు భూమి అవసరమని కోరారు. విశాఖపట్నం, అమరావతి, గన్నవరం దగ్గర మూడు మెగా టెర్మినల్స్‌కు కావాల్సిన భూమిని ప్రభుత్వం కేటాయించాలని రైల్వేశాఖ కోరుతోంది. ఈ మూడు టెర్మినల్స్‌తో పాటుగా ఏపీ ప్రభుత్వం నుంచి మరో టెర్మినల్ కూడా ప్రతిపాదిస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర రేణిగుంటకు సమీపంలో టెర్మినల్‌ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సూచించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.. వచ్చే రైళ్లు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే తిరుపతి-రేణిగుంట మధ్య ఈ టెర్మినల్ ఉండేలా భూమిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే త్వరలోనే ఈ టెర్మినల్స్ నిర్మాణాలు ఊపందుకోనున్నాయి.